న్యూ ఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దశాబ్ధాల తరబడిగా భారత్ - పాకిస్తాన్ మధ్య నలుగుతున్న కశ్మీర్ వివాదంపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలోనే ప్రకటించినట్టుగా భారత్ - పాకిస్తాన్ అంగీకరిస్తే.. కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిగా ఉండటానికి తాను సిద్ధంగా ఉన్నానని అగ్రరాజ్యం అధినేత ట్రంప్ మరోసారి స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి అమెరికా - భారత్ ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాయని.. ఇకపై కూడా రెండు దేశాలు ఉగ్రవాదానికి అంతం పలికేందుకు కృషి చేస్తాయని ట్రంప్ అన్నారు. భారత పర్యటనలో భాగంగా రెండో రోజైన మంగళవారం ఢిల్లీలో పలువురు వ్యాపారవేత్తలతో మాట్లాడిన అనంతరం అమెరికా రాయబార కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్ చేరుకున్న డొనాల్డ్ ట్రంప్‌నకు అక్కడి ఘన స్వాగతం లభించింది. రాష్ర్టపతి కార్యాలయం సందర్శన అనంతరం రాజ్ ఘాట్ సందర్శించిన డొనాల్డ్ ట్రంప్ దంపతులు.. అక్కడ భారత జాతిపిత మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళి అర్పించారు. మంగళవారం రాత్రి 8 గంటలకు రాష్ర్టపతి భవన్‌లో ట్రంప్ దంపతులకు ఘనమైన విందు ఏర్పాటు చేశారు. దేశం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ విందులో పాల్గొననున్నారు. ఈ విందు అనంతరం రాత్రి 10 గంటలకు ప్రత్యేక విమానంలో ట్రంప్ దంపతులు, ఆయన కుమార్తె, అల్లుడు తన బృందంతో కలిసి అమెరికా తిరుగు ప్రయాణం కానున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..