వాజ్‌పేయి.. కోల్‌కతా ఫ్యామిలీ..ఓ టీ
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గురువారం సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గురువారం సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు కోల్‌కతా వాసులు. వాజ్‌పేయి కోల్‌కతాకి ఎప్పుడు వచ్చిన తమ ఇంట్లోనే ఉండేవారని అంటున్నారు బేరీవాలా ఫ్యామిలీ...
బేరీవాలా ఫ్యామిలీ చెందిన గన్‌శ్యామ్ బేరీవాలా ఓ వ్యాపారవేత్త.. వాజ్‌పేయికి స్నేహితుడు. బేరీవాలా 1952లో తొలిసారి ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ కార్యాలయంలో జరిగిన ఆర్ఎస్ఎస్ మీటింగ్‌లో కలిశారు. వాజ్‌పేయి ఎప్పుడు కోల్‌కతాకు వెళ్లిన బేరీవాలా ఇంట్లోనే ఉండేవారు.
గన్‌శ్యామ్ బేరీవాలా కుమారుడు కమల్ బెరీవాల్ మాట్లాడుతూ.. 'కోల్‌కతాకు ఎప్పుడొచ్చినా అటల్‌జీ హోటల్‌లో ఉండటానికి ఇష్టపడేవారు కాదు. చిత్తరంజన్ అవెన్యూలో మా ఇంట్లోనే, ఒక కుటుంబ సభ్యుడిగా గడిపేవారు' అని అన్నారు.
'మా నాన్న గన్‌శ్యామ్ బేరీవాలా, వాజ్‌పేయి మంచి స్నేహితులు. వారిద్దరూ కలిసినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకోరు. పద్యాలు, సినిమాలు, స్ట్రీట్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటారు' అని చెప్పారు. వాజ్‌పేయికి కోల్‌కతా అన్నా, ఇక్కడి ఆహారాలు అన్నా ఇష్టమని చెప్పారు.
వాజ్‌పేయి తమకోసం టీ చేసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు బేరీవాల్ కుటుంబ సభ్యులు. వాజ్‌పేయి తన పర్యటనలో భాగంగా ఓసారి కోల్‌కతా వచ్చినప్పుడు తమ కోసం టీ తయారుచేశారని.. అందరం కూర్చొని వీసీయార్‌లో రేఖ నటించిన ఉమ్రావో జాన్ సినిమా చూసినట్లు చెప్పారు కమల్. 'ఉమ్రావో జాన్ ఆయన ఫేవరేట్ సినిమా. ఆయనకు సినిమాలంటే ఇష్టం. మాతో కలిసి ఆయన బోలెడు సినిమాలు చూశారు' అని అన్నారు కమల్.
కమల్ బెరీవాల్ పుట్టినప్పుడు 1956లో వాజ్‌పేయి తొలిసారి బేరీవాలా ఇంటిని సందర్శించారు. ఆతరువాత కోల్‌కతాకు ఎప్పుడొచ్చినా అటల్ ఈ ఇంట్లోనే ఉండేవారు. 2004లో ఆయనతో చివరిసారి కలిశానని కమల్ చెప్పుకొచ్చారు.