ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (68) స్వల్ప అస్వస్థతకు గురికావడంతో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. దీంతో వైద్యులు యాంజియోగ్రఫీ టెస్టులు చేసి, స్టెంట్ అమర్చారు. ప్రస్తుతం వెంకయ్య నాయుడు అబ్సర్వేషన్ లో ఉన్నట్లు సీనియర్ వైద్యుడు చెప్పారు. ‘‘ఉపరాష్ట్రపతికి యాంజియోగ్రఫీ పరీక్ష చేశాం. ఆయన గుండె రక్తనాళాల్లో ఒకటి సన్నబడిందని గుర్తించాం. ఈ క్రమంలోనే స్టెంట్‌ వేశాం’’ అన్నారు. ఆయన శనివారం డిశ్చార్జ్ అవుతారని వైద్యులు తెలిపారు. 


శుక్రవారం ఉదయం 8 గంటలకు బీపీ, షుగర్ లెవల్స్ పెరగడంతో అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది ఆయనను ఎయిమ్స్ ఆసుపత్రిలో కార్డియో- న్యూరో సెంటర్ లో చేర్చారు. ఆయనకు ఎయిమ్స్‌ కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్‌ బల్‌రాం భార్గవ పర్యవేక్షణలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ఆగస్టు నెలలో వెంకయ్యనాయుడుకు ఎయిమ్స్ వైద్యులు 'కంప్లీట్ బాడీ చెకప్' చేశారు. ఆ పరీక్షల్లో ఆయనకు గుండె సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.