ఎట్టకేలకు గుజరాత్ సీఎంగా ఎవరు కొనసాగుతారన్న వివాదానికి తెరపడింది. బీజేపీ ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత గుజరాత్ సీఎంగా ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపానీయే కొనసాగుతారని అధికార పార్టీ తెలియజేసింది. అలాగే ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ కొనసాగుతారని తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరియు బీజేపీ ముఖ్య కార్యదర్శి సరోజ్ పాండే ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గుజరాత్ రాష్ట్ర బీజేపీ కమిటీ ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించేలా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని భావించినప్పటికీ.. అలాంటి నిర్ణయమేమీ తాజాగా పార్టీ తీసుకోలేదు. రూపానీ ముఖ్యమంత్రిగా ఉన్నా.. గుజరాత్ ఎన్నికల్లో 100 సీట్ల మైలురాయిని బీజేపీ దాటలేదన్న విమర్శలను ఖండిస్తూ.. ఆయన నాయకత్వంలోనే ప్రస్తుత రాష్ట్ర మంత్రి వర్గం ఏర్పడుతుందని అధికార పార్టీ ప్రకటించింది. డిసెంబరు 25 తేదిన (అనగా అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినం) సందర్భంగా రూపానీ మళ్లీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ అధికార ప్రతినిధి తెలిపారు.