`ఒక అభ్యర్థి.. ఒకే సీటు` దానికే మా మద్దతు: ఈసీ
ఎన్నికల్లో అభ్యర్థి రెండు స్థానాల్లో పోటీ చేయాలనే ప్రతిపాదనకు మేము మద్దతు ఇవ్వబోమని, ఎన్నికలలో ఒక సీటు నుండి ఒకే అభ్యర్థి పోటీ చేయాలనే ప్రతిపాదనకు మద్దతిస్తామని కేంద్ర ఎన్నికల్ సంఘం(ఈసీ) సుప్రీం కోర్టుకు తెలిపింది.
న్యూఢిల్లీ: ఎన్నికల్లో అభ్యర్థి రెండు స్థానాల్లో పోటీ చేయాలనే ప్రతిపాదనకు మేము మద్దతు ఇవ్వబోమని, ఎన్నికలలో ఒక సీటు నుండి ఒకే అభ్యర్థి పోటీ చేయాలనే ప్రతిపాదనకు మద్దతిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సుప్రీం కోర్టుకు తెలిపింది. ప్రస్తుత చట్టాల ప్రకారం, లోక్ సభ మరియు శాసనసభ ఎన్నికలలో ఒక అభ్యర్థి గరిష్టంగా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయవచ్చు. ఒకటి కంటే ఎక్కువ సీట్ల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల నిబంధనలకు సంబంధించిన ఓ పిల్‌కు ప్రతిస్పందనగా ఈసీ సమాధానం ఇచ్చింది. గత ఏడాది డిసెంబర్‌లో ఈ అంశంపై బదులివ్వాలని కోరుతూ సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం, ఈసీలకు నోటీసులు జారీ చేసింది.
అఫిడవిట్‌లో ఈసీ ఇలా పేర్కొంది. 'ఒక అభ్యర్థి-ఒక సీటు ఉండే విధంగా ప్రజా ప్రాతినిథ్య చట్టాన్ని సవరించాలని సూచించింది. రెండు సీట్ల నుంచి అభ్యర్థి పోటీని అనుమతించాలంటే ప్రభుత్వ ఖజానా పై అనవసర/తప్పని భారం పడుతుంది. 2004 మరియు 2016లలో ఆ విషయంపై ప్రతిపాదనలు పంపినప్పుడు గతంలో కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాలను రెండుసార్లు తెలియజేసింది.' అంది.
ఒక అభ్యర్థి పలు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అనుమతించరాదని కోరుతూ బీజేపీ నేత అశ్వని కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా ఈ పద్దతిని నేతలు అనుసరిస్తుండటంతో తరచూ ఉప ఎన్నికలు అనివార్యమవుతున్నాయి. ఒక వ్యక్తి రెండు స్థానాల్లో పోటీ చేసి రెండు స్ధానాల్లోనూ గెలుపొందుతాడు. అయితే ఆ తర్వాత ఓ నియోజకవర్గాన్ని వదులుకోవడంతో అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. అభ్యర్ధులకు ఈ వెసులుబాటు కల్పిస్తున్న ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్33(7)ను సవాల్ చేస్తూ ఉపాధ్యాయ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.