ఢిల్లీలో ఆకలికి తట్టుకోలేక ముగ్గురు చిన్నారులు మృతి చెందిన కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పిల్లలు చనిపోక ముందు రాత్రి అంటే జులై 23న ఆ చిన్నారుల తండ్రి ఏదో తెలియని ఔషధం (విషపూరిత మెడిసిన్) ఇచ్చారని.. ఆ మందుల ప్రభావంతోనే వారికి వాంతులు, విరేచనాలు కలిగాయని, జీర్ణాశయం ఇన్ఫెక్షన్‌కు గురైందని పోస్టుమార్టం నివేదికలో తేలింది. మరోవైపు తండ్రి మంగళ్‌ సింగ్ పిల్లలు చనిపోయినప్పటి నుంచి కనిపించకుండా పోయాడని.. అతనిపైనే అనుమానం ఉన్నట్లుగా ప్రాథమిక దర్యాప్తు రిపోర్టును తయారుచేసిన అధికారులు ఢిల్లీ ప్రభుత్వానికి నివేదించారు. డాక్టర్లు చెప్పిన విషయాలనే అందులో పేర్కొన్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలోని మండ్వాలీ గ్రామంలో రిక్షా తొక్కుతూ జీవనం సాగించే మంగళ్‌ సింగ్ తాగుడుకు బానిసై.. రిక్షాను ఎవరో దొంగిలించడంతో ఖాళీగా ఉంటున్నాడు. వాస్తవానికి పిల్లలు రోజూ ఏదో ఒకటి తింటున్నా పౌష్ఠికాహారలోపం స్పష్టంగా కనిపించేది. తండ్రి ఖాళీగా ఉండటంతో ఇంటి పోషణ కష్టమైంది. ఆ కుటుంబానికి రేషన్ కార్డు కూడా లేదు. ఆహారం లేక భార్య, పిల్లలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. చిన్నారులకు సమయానికి ఓఆర్ఎస్ ద్రావణం, ఔషధాలు అందలేక డీహైడ్రేషన్‌ బారినపడ్డారు. అదే రోజు రాత్రి పిల్లలకు ఏదో మందు కలిపి ఇచ్చి భార్యతో చెప్పకుండా అతడు ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు దర్యాప్తులో తేలింది. పరారీలో ఉన్న మంగళ్‌ సింగ్ కోసం గాలింపు చేపట్టారు.