పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి గట్టి షాక్!
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి గట్టి షాక్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సొంత పార్టీకే గట్టి షాక్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీని మరోసారి దేశానికి ప్రధానిని చేయాలని ఓవైపు ఆ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంటే, మరోవైపు ఆయన మాత్రం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఆమెకు దేశ ప్రధాని రేసులో ముందంజలో వున్నారని వ్యాఖ్యానించి పార్టీకి ఝలక్ ఇచ్చారు. మమతా బెనర్జీకి ప్రధాని అయ్యే అన్ని అర్హతలు వున్నాయన్న ఆయన.. ఆమె సమర్థవంతమైన ప్రధాని అవుతారనడంలో ఎటువంటి సందేహం లేదని అభిప్రాయపడ్డారు. ఒకవేళ బెంగాల్ నుంచి ప్రధాని అయ్యే అవకాశం ఎవరికైనా వస్తుందంటే.. అది కేవలం మమతా బెనర్జీకేనని అన్నారు. ప్రధాని కావాలని కోరుకుంటున్న మమతకు తాను కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నానని దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించడం బీజేపీ అధినాయకత్వాన్ని, ఆ పార్టీ శ్రేణులను అయోమయంలో పడేసింది. అంతేకాకుండా మమతా బెనర్జీ తన ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని దిలీప్ ఘోష్ ఆమె శ్రేయోభిలాషిగా సలహా కూడా ఇచ్చారు. మమతా బెనర్జీకి 64వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే క్రమంలో దిలీప్ ఘోష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఓవైపు రథయాత్ర విషయంలో బీజేపీకి, టీఎంసీకి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమేంత వైరం కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో దిలీప్ ఘోష్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.