హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది విజయం సాధించింది. అయితే, ఇప్పుడు ఆ రాష్ట్ర ఓటర్లు, బీజేపీ నేతల ముందున్న ఏకైక ప్రశ్న తనకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనేదే! సెరాజ్ నియోజకవర్గం నుంచి కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన జైరామ్ ఠాకూర్ ముఖ్యమంత్రి రేసులో వున్న అభ్యర్థుల జాబితాలో వున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఠాకూర్.. పార్టీ అధిష్టానం ఎలా చెబితే అలా నడుచుకోవడానికి తాను సిద్ధంగా వున్నానని అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ గెలుపొందడమే తమకి ఎంతో సంతోషాన్ని కలిగించింది. అందుకే రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్లి రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకుంటాం అని అన్నారు ఠాకూర్.  


ఇక ఠాకూర్ కి పోటీగా వున్న మరో ఇద్దరు అభ్యర్థులు అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థుల చేతిలో ఓటమి చవిచూశారు. దీంతో ఠాకూర్ కి పోటీగా ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో వున్న ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేరు వినిపిస్తోంది. జగత్ ప్రకాష్ నడ్డా ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు దగ్గరి వ్యక్తి కావడంతో ఆ ఇద్దరితో వున్న సాన్నిహిత్యం నడ్డాకి కలిసొచ్చే అంశం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతిమంగా బీజేపీ అధిష్టానం ఎవరిని హమాచల్ ప్రదేశ్ కి ముఖ్యమంత్రిని చేస్తుందో వేచిచూడాల్సిందే మరి!!