పలువురు మహిళా జర్నలిస్టుల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్.. తనపై వస్తున్న ఆరోపణలపై ప్రస్తుతం స్పందించలేనని తెలిపారు. నైజీరియా పర్యటనను ముగించుకొని ఆదివారం ఉదయం స్వదేశానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో వేచి ఉన్న మీడియా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై మంత్రి పైవిధంగా బదులిస్తూ అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. అయితే ఎంజే అక్బర్‌తో అధిష్టానం కూర్చొని చర్చించిన తర్వాతే ఆయన భవితవ్యంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయితే కేంద్ర సహాయ మంత్రి ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  ఆయన ప్రధాన మంత్రి కార్యాలయానికి తన రాజీనామాను పంపించినట్టు.. అయితే, అక్బర్‌ రాజీనామాను పీఎంవో కార్యాలయం ఇంకా ధ్రువీకరించలేదని ఆ వార్తల సారాంశం.


ఎంజే అక్బర్ ఎడిటర్‌గా ఉన్నప్పుడు తమను వేధించాడంటూ ముగ్గురు మహిళా జర్నలిస్టులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఎంజే అక్బర్ తనను వేధించారంటూ తొలిసారి ప్రియా రమణి అనే జర్నలిస్ట్ బయటపెట్టగా... ఆ తర్వాత ప్రేరణ సింగ్ బింద్రా, మరికొంతమంది మహిళా జర్నలిస్టులు కూడా అక్బర్‌పై ఇలాంటి ఆరోపణలే చేశారు. దీంతో ఆయన్ను కేబినెట్ నుంచి తప్పించాలని విపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగింది. అయితే ఇప్పటివరకు బీజేపీగానీ, కేంద్రం గానీ ఈ అంశంపై స్పందించలేదు.


కాగాప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఎంజే అక్బర్‌.. ది టెలిగ్రాఫ్‌, ఆసియన్‌ ఏజ్‌, ది సండే గార్డియన్‌ వంటి వార్తా పత్రికలకు ఎడిటర్‌గా పనిచేశారు.