శీతాకాల సమావేశాల్లో ప్రధాన బిల్లులైన త్రిపుల్ తలాక్ బిల్లు 2017, 123వ రాజ్యాంగ సవరణ బిల్లు 2017 ఆమోదం పొందలేదని.. జనవరి 29నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ మీడియాకు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"త్రిపుల్ తలాక్ బిల్లు, వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ వంటి ప్రధాన బిల్లులు, జాతీయ ప్రాధాన్యత అంశాలపై అన్ని పార్టీల నుంచి సహకారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది' అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ శనివారం తెలిపారు.


"ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల రక్షణ) బిల్లు రాజ్యసభలో, ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదాను ప్రతిపాదిస్తూ.. 123వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందలేదు. కానీ  రెండు సభలు ఈ సమావేశాల్లో 22 బిల్లులను ఆమోదించాయి. ఈ సమావేశాలు విజయవంతమయ్యాయి" అని మంత్రి పేర్కొన్నారు.       


"ఈ సమావేశాల్లో 13 సమావేశాలు జరిగాయి. వాటిలో నాలుగు శుక్రవారాలు ఉన్నాయి. ఎనిమిది పనిదినాల్లో రెండు సభల్లో 22 బిల్లులు ఆమోదం పొందాయి" అని చెప్పారాయన.


ప్రభుత్వ అజెండాలోని ముఖ్యమైన రెండు బిల్లులపై మాట్లాడుతూ, "ఒక విప్లవాత్మక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు దేశవ్యాప్త చర్చ జరుగుతుంది. మొత్తం దేశం ఇప్పుడు ఓబీసీ కమిషన్, త్రిపుల్ తలాక్ పై చర్చలు చేస్తోంది" అన్నారు. 


"రాజ్యసభలో అర్థరహిత సవరణతో ప్రతిపక్షాలు (ఓబిసి కమిషన్) బిల్లును అడ్డుకున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో ఆ బిల్లులు ఆమోదం పొందేలా ప్రయత్నిస్తాం' అని ఆయన చెప్పారు. కాగా రాజ్యసభ చేసిన సవరణకు ప్రత్యామ్నాయంగా లోక్సభలో ప్రభుత్వం ఒక సవరణతో బిల్లును ప్రవేశపెట్టింది.