ప్రపంచంలోనే తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన  సబ్అర్బన్ రైలు 26 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పశ్చిమ రైల్వే సరిగ్గా 26 ఏళ్ల క్రితం మొదటిసారిగా పూర్తిగా మహిళల కోసం ప్రత్యేక రైలు సర్వీసును ప్రారంభించింది. 1992 మే 5వ తేదీన ముంబయిలోని చర్చ్‌గేట్‌ నుంచి బోరివాలీ స్టేషన్ల మధ్య ఈ రైలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ రైలు నడస్తూనే ఉంది. అప్పట్లో రోజుకు రెండు సర్వీసులు ఉండగా ఇప్పుడు రోజుకు ఎనిమిదికి చేరింది. ఉదయం నాలుగు, సాయంత్రం మరో నాలుగు సర్వీసులను నడుపుతోంది పశ్చిమ రైల్వే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రైలు సర్వీసులు ప్రారంభించి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టికెట్టు తనిఖీ సిబ్బంది మహిళా ప్రయాణీకులకు రోజా పూలు ఇచ్చి గ్రీటింగ్స్ చెప్పారు. ఫాం ఇచ్చి ఫీడ్ బ్యాక్ ఇవ్వమని కోరారు.


'మహిళా రైలును తొలుత చర్చ్‌గేట్‌ నుంచి బోరివాలీ మధ్య ప్రారంభించారు.1993లో ఈ సర్వీసును విరార్‌ వరకు పొడిగించారు. ముంబయిలో ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతోంది' అని ఓ పశ్చిమ రైల్వే అధికారి  తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఓ రైలును మహిళా ప్రయాణికుల కోసమే కేటాయించడం చాలా గొప్ప మైలురాయి లాంటిదని అన్నారు. ఇళ్ల నుంచి పని చేసే చోటుకు, తిరిగి పని చేసే చోటు నుంచి ఇళ్లకు చేరుకోవడానికి మహిళలకు ఈ రైల్లో తగిన భద్రత లభిస్తోందన్నారు. పశ్చిమ రైల్వేని అనుసరిస్తూ 1992 జులై 1వ తేదీన మధ్య రైల్వే కూడా ప్రత్యేకంగా మహిళల కోసం సబర్బన్‌ సేవలను ప్రారంభించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టర్మినస్‌(సీఎస్‌ఎంటీ) నుంచి కళ్యాణ్‌ ప్రాంతం వరకు ప్రత్యేకంగా మహిళ కోసం రైళ్లు ప్రారంభించింది.