బ్యాంకులకు వేల కోట్ల అప్పులు ఎగవేసి దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యాకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సహకరించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం న్యూఢిల్లీలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాహుల్ మాట్లాడారు. 'ఇండియాను విడిచి వెళ్ళేటప్పుడు మాల్యా పార్లమెంటులో అరుణ్ జైట్లీని కలిశారని నిన్న (బుధవారం) చెప్పారు. అన్ని ములాఖత్‌ల గురించి తన బ్లాగులో పేర్కొనే జైట్లీజీ ఈ  విషయాన్ని ఎందుకు దాచారు. జైట్లీజీ మాల్యాతో కొద్దిసేపే మాట్లాడాను అని చెప్పడం అబద్దం' అని రాహుల్ గాంధీ అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఆర్థిక మంత్రి ఓ ఆర్థిక నేరస్తుడితో మాట్లాడారు. లండన్‌కి పోతున్నానని పోలీసులకు కూడా చెప్పని మాల్యా.. జైట్లీకి చెప్పి పారిపోయాడు. అప్పుడు జైట్లీ సీబీఐ, ఈడీ, పోలీసులకు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు? బీజేపీ వల్లే మాల్యా అరెస్టు వారెంట్.. సమాచార నోటీసుగా మారింది.' అని విమర్శించారు. ఆర్థిక మంత్రి ఈ వ్యవహారంలో కుమ్మకై అతడ్ని దేశం నుంచి స్వేచ్ఛగా వెళ్లిపోయేలా చేశారని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం రఫెల్ మీద అబద్దాలాడుతోంది. మాల్యా విషయంలో కూడా అబద్దం చెబుతోందని ఆరోపించారు. జైట్లీ చెప్పకుండా ఉండటానికి కారణం స్వయంగా తానేనా? లేకపోతే అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అనేది తెలియజేయాలని పరోక్షంగా నరేంద్ర మోదీని ప్రస్తావిస్తూ నిలదీశారు.


'తను (మాల్యా) కారిడార్లో మీతో కలిసి లండన్‌కు వెళ్తున్నానని చెప్పినప్పుడు.. మీరు వెంటనే సిబిఐ, ఈడీ పోలీసులకు ఎందుకు చెప్పలేదు. అతను దేశం విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు అతన్ని పట్టించలేదు? అంటే ఇది కుట్రలో భాగంగా జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. ఖచ్చితంగా డీల్ జరిగే ఉంటుంది. ఆర్థిక శాఖ మంత్రి అదేంటో స్పష్టంగా చెప్పాలి, పదవికి రాజీనామా చేయాలి' అని రాహుల్ అన్నారు.


మాల్యా 2016 మార్చి 2న భారతదేశం నుంచి బ్రిటన్ పారిపోయిన సంగతి తెలిసిందే. ఆయనను తిరిగి భారతదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం బ్రిటన్ కోర్టులో కేసు దాఖలు చేసింది.  నిన్నటితో మాల్యాను భారత్‌కు అప్పగించే కేసు విచారణ పూర్తయింది. దీనిపై డిసెంబర్‌ 10న లండన్‌ కోర్టు తీర్పు వెల్లడించనుంది.