క్రీడారంగంలో భారత దేశానికి పేరు, ప్రఖ్యాతలు తీసుకొచ్చిన మహిళా అథ్లెట్లను గౌరవించే సదుద్దేశంతో జీ న్యూస్ ఫేయిర్‌ప్లే అవార్డ్స్ పేరిట జీ మీడియా గ్రూప్ నిర్వహించిన కార్యక్రమం ఇవాళ ఢిల్లీలో ఘనంగా జరిగింది. గత కొన్నేళ్ల కాలంలో భారతీయ మహిళా అథ్లెట్లు ఎంతో మంది అంతర్జాతీయ వేదికలపై తమ సత్తా చాటుకుని దేశం పేరు నిలబెట్టిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కి పేరు తీసుకొచ్చిన పీవీ సింధు, సైనా నేహ్వాల్, సానియా మీర్జా లాంటి తెలుగు తేజాలు కూడా ఈ జాబితాలో వున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయ పోటీల్లో అనేకసార్లు పతకాలు సాధించిన హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను జీ మీడియా గ్రూప్ ఈ వేదికపై మొదటి అవార్డుతో సత్కరించింది. సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్స్‌లో తన సత్తా చాటుకున్న సానియా మీర్జా.. ఉమెన్స్ డబుల్స్‌లో ప్రపంచంలోనే నెంబర్ 1 ర్యాంక్ సైతం అందుకున్నారు. 2007లో ప్రపంచంలో 27వ ర్యాంక్‌కి చేరుకున్న సానియా మీర్జా.. అప్పటికి దేశంలో అత్యున్నత ర్యాంక్ కలిగిన భారత క్రీడాకారిణిగా పేరు సొంతం చేసుకున్నారు. 2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో ఒలంపిక్స్‌లో పాల్గొని మూడు ఒలంపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారిణిగాను సానియా గుర్తింపు సొంతం చేసుకున్నారు. 2013లో సింగిల్స్ నుంచి రిటైర్ అయిన సానియాను భారత ప్రభుత్వం అర్జున అవార్డ్, పద్మ శ్రీ, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది.



బ్యాడ్మింటన్ క్రీడలో తొలిసారి భారత్‌కి ఒలంపిక్ మెడల్ సాధించిన స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నేహ్వాల్ ఆ తర్వాత జీ న్యూస్ ఫేయిర్‌ప్లే అవార్డ్స్ సొంతం చేసుకున్న వారి జాబితాలో వున్నారు. 2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో సహా మూడు ఒలంపిక్స్ పోటీల్లో పాల్గొన్న సైనా నేహ్వాల్ గతంలో ప్రపంచంలో నెంబర్ 1 ర్యాంక్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నారు. అనేక అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని 23 సార్లు టైటిల్స్ గెల్చుకున్న సైనా నేహ్వాల్‌ని భారత ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డ్, పద్మ భూషణ్ పురస్కారాలతో సత్కరించిన సంగతి తెలిసిందే. 



భారతీయ మాజీ షూటర్ అంజలి భగవత్‌ని జీ మీడియా జీ న్యూస్ ఫేయిర్‌ప్లే అవార్డుతో సత్కరించింది. వరుసగా మూడు ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్న అంజలి భగవత్ ఖాతాలో అనేక విజయాలు వున్నాయి. 2002లోనే 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ విభాగంలో వరల్డ్ నెంబర్ 1 అయిన అంజలి భగవత్.. ఆ తర్వాతి ఏడాది మిలాన్‌లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో మొదటి వరల్డ్ కప్ టైటిల్ గెల్చుకున్నారు. 2000లో సిడ్నీ ఒలంపిక్స్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రవేశం పొందిన అంజలి భగవత్ ఆ పోటీల్లో ఫైనల్స్ వరకు చేరుకోవడం విశేషం. కామ్వెల్త్ క్రీడల్లో 10 మీటర్ల రైఫిల్ విభాగం, స్పోర్ట్స్ రైఫిల్ 3పీ ఈవెంట్స్ విభాగంలో పాల్గొని 12 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్ మెడల్స్ సొంతం చేసుకున్నారామె. వివిధ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న అంజలి భగవత్‌ని 31 గోల్డ్ మెడల్స్, 23 సిల్వర్ మెడల్స్, ఏడు కాంస్య పతకాలు వరించడం విశేషం. అంజలి భగవత్ ప్రతిభకు ఆమెను వరించిన పతకాలు ఓ మచ్చుతునక మాత్రమే.



ఈ జీ న్యూస్ ఫేయిర్‌ప్లే అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ ఎంపీ డా. సుభాష్ చంద్ర కార్యక్రమంలో పాల్గొన్న అతిథులని ఉద్దేశించి మాట్లాడుతూ.. క్రీడారంగంలో రాణిస్తున్న మహిళామణులని సత్కరించుకునే అవకాశం జీ మీడియాకు వచ్చినందుకు తాను ఎంతో సంతోషిస్తున్నాను అని అన్నారు. పురుషులకన్నా మహిళలే ఎక్కువ అంకిత భావంతో కలిగి వుంటారు అని ఈ సందర్భంగా డా. సుభాష్ చంద్ర మహిళామణులకి కితాబు ఇచ్చారు. సమాజంలో మహిళలను అణిచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. కానీ మహిళలు అంత బలహీనులేమీ కాదు. అణిచివేసే ప్రయత్నం జరిగిన ప్రతీసారి వాళ్లు తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటూ పైకి వస్తున్నారని అన్నారు. అందుకే వారిని ప్రోత్సహించేందుకు ఇకపై కూడా మహిళల కోసం తాము మరిన్ని అవార్డ్సుని మీ ముందుకు తీసుకొస్తాం అని ఈ సందర్భంగా డా. సుభాష్ చంద్ర స్పష్టంచేశారు.



ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ వేదికలపై తమ సత్తా చాటుకుని భారత దేశానికి పేరు, ప్రఖ్యాతలు తీసుకొచ్చిన మహిళామణులెందరినో ఈ వేదికపై సన్మానించిన జీ మీడియా గ్రూప్.. క్రీడారంగంలో మహిళామణుల భాగస్వామ్యం కోసం, క్రీడారంగం అభివృద్ధి కోసం వారి నుంచి పలు సూచనలు, సలహాలు సైతం అడిగి తెలుసుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరాని సహా పలువురు కేంద్ర మంత్రులు సైతం ముఖ్య అతిథులుగా పాల్గొని మహిళామణులని జీ న్యూస్ ఫేయిర్‌ప్లే అవార్డులతో సత్కరించారు.