Villagers Protests Against Maoists: మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నక్సలిజం వద్దు .. తమకు అభివృద్ధే ముద్దు అంటూ మావోయిస్టులను తమ గ్రామాల్లోకి రావద్దంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని మారుమూల గ్రామాల ఆదివాసీలు బుధవారం చర్ల మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ నుండి రెవెన్యూ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ర్యాలీలో మావోయిస్టులు తీసుకువస్తానంటున్న జనతన సర్కార్ మాకు వద్దు తెలంగాణ సర్కార్ చాలు, బుల్లెట్ సంస్కృతి వీడి బ్యాలెట్ సంస్కృతి ద్వారా గ్రామాలను అభివృద్ధి చేయాలంటూ మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్ల కార్డులు, బ్యానర్స్ చేత పట్టుకొని నినాదాలు చేశారు. అనంతరం చర్ల మండలం తహశీల్దార్ రంగు రమేష్ కు వినతి పత్రం అందించారు. 


ఈ సందర్భంగా మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించిన ఆదివాసీలు మాట్లాడుతూ, " నాలుగు దశాబ్దాల క్రితం పొట్ట చేత పట్టుకొని పొరుగునే ఉన్న చతిస్గడ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చామని అప్పటి ప్రభుత్వం తమను ఆదరించి తాము ఏర్పాటు చేసుకున్న గ్రామాలను గుర్తించి తమకు మౌలిక సదుపాయాలు కల్పించింది " అని అన్నారు. 


" అయితే, తాము ఏర్పాటు చేసుకున్న గ్రామాలు అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల తరచుగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యులు గ్రామాలకు వచ్చి గ్రామస్తులను భయబ్రాంతులకు గురిచేసేలా సమావేశాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఆయా సమావేశాలకు బియ్యం, ఉప్పు, పప్పు, నూనె అంటూ ఏవేవో నిత్యవసర వస్తువులను తీసుకురమ్మని బలవంత పెడుతున్నారు " అని వాపోయారు. 


మావోయిస్టుల వల్ల తమ గ్రామాలు అభివృద్ధి చెందడం లేదని అందుకే మావోయిస్టులను తమ గ్రామాల్లోకి రాకుండా చేయాలని తాము అధికారులకు వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. కాగా మావోయిస్టు పార్టీ 19వ వార్షికోత్సవాలు నేటితో ముగియనుండగా పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్న వలస ఆదివాసి గ్రామాల ప్రజలు మండల కేంద్రంలో ఈ భారీ ర్యాలీ నిర్వహించడం రాష్ట్క వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.