దయాశంకర్ మిశ్రా, డిజిటల్ ఎడిటర్, జీ న్యూస్ హిందీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లేఖ, మనకు ఉన్న మరిచిపోలేని మధురమైన జ్ఞాపకాల్లో ఒకటి. లేఖ, ఉత్తరం, పోస్ట్ కార్డ్ వంటి పదాలను గుర్తుచేసుకుంటుంటే అప్పటి మధురక్షణాలు అలా కళ్లముందు కదలాడుతున్నాయంటే వాటిని గుర్తు చేసుకోవడంలో ఎంత మధురమైన అనుభూతి ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి ఎప్పుడూ వెలితిని భరించలేదని అంటుంటారు. ఒకటి ఖాళీ అయితే, ఆ స్థానాన్ని భర్తి చేసేందుకు గాలిలో ఎప్పుడూ ఏదో ఒకటి సదా సిద్ధంగా ఉంటుందట. కానీ మన జీవితాల్లోంచి లేఖలు అదృశ్యం అయ్యాకా ఇప్పటివరకు ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ అటువంటి అనుభూతిని ఇచ్చేది ఏదీ మరొకటి నాకైతే కనిపించలేదు.  


మొబైల్, సోషల్ మీడియా రాకతో మనం లేఖను మట్టిలో కలిపేశాం. మన మనస్సు మరో కొత్త అభిరుచుల వైపు లాగేసింది. లేఖ స్థానాన్ని ఎస్ఎంఎస్, వాట్సాప్ లాంటివి భర్తీ చేస్తాయని భావించినా.. అలా జరగలేదు. పైగా ప్రేమాభిమానాలు ఉండే చోట ఆగ్రహావేశాలు అధికమయ్యాయి. 


డియర్ జిందగీ చదివే పాఠకులకు ఎవరికైనా లేఖలు రాసిన అనుభవం వుంటే, ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ రోజులను మరొక్కసారి నెమరేసుకోండి. లేఖ రాయడానికి కేటాయించిన సమయం, ఆ సమయంలో మనసు పొందిన అనుభూతిని గుర్తుచేసుకోండి. వాటి ముందు ఇవేవీ సాటిరావు అని అనిపించకమానదు. 


చాలా సందర్భాల్లో ఎంతో ప్రయత్నించి, శ్రమించి రాసిన లేఖలు మనలోని మనసు తెరలెన్నింటినో ఆవిష్కరించడం మీకూ ఇంకా గుర్తుండే ఉంటుంది. మనసు తెరల్లోపలికి వెళ్లి, స్నేహం, ప్రేమ వంటి అనుభూతులను అందించే పదాలను ఒక మాలగా కూర్చి లేఖ రాసిన తీరు కూడా గుర్తొస్తుంది. అసంతృప్తితో రాసుకున్న లేఖలు, ప్రేమతో రాసుకున్న ఉత్తరాలు, ఒకరి గురించి మరొకరు తెలుసుకునేందుకు రాసుకున్న ఉత్తరాలు నేటి తరం సెల్ఫీలకన్నా ఇంకెంతో లోతుగా ఉండేవి. ఒకరికొకరు లేఖలు రాసుకోవడం, చదువుకోవడం అనేది మనకు ఒంటరితనాన్ని దరిచేరనిచ్చేది కాదు. అలా ఒకరికొకరికి మధ్య అనుబంధాలను పెంచడంలో లేఖలు పోషించిన స్థానాన్ని ఇంకేవీ భర్తీ చేయలేవు. మనం లేఖ కోసం ఎదురుచూడటంలో ఉన్న మాధుర్యం మొబైల్ రాకతో మటుమాయమైపోయింది. 


మనమంతా కేవలం ఉరుకుల పరుగుల జీవితంలో పడిపోయి రకరకాల సమస్యల మధ్య చిక్కుకుంటున్నాం. అంతకుమించిన కోపోద్రిక్తులమవుతున్నాం. మొబైల్, సోషల్ మీడియా మన మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి ఒకరికొకరిని దగ్గరచేస్తోంది కానీ దూరంగా ఉండి రాసుకున్న లేఖల్లోని మాధుర్యాన్ని మాత్రం అందించలేకపోతోంది. 


నిరంతరం సోషల్ మీడియాలోనే సమయం గడుపుతూ ఫేస్‌బుక్‌లో వేల మంది స్నేహితులు కలిగిన ఓ వ్యక్తి ఆస్పత్రిపాలైతే కానీ అతడికి తెలిసిరాలేదు.. ఆపరేషన్ థియేటర్ బయట తాను క్షేమంగా బయటికి రావాలని వేచిచూస్తోంది తన తల్లిదండ్రులు, అన్నాదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు మాత్రమే అని. కానీ వాస్తవానికి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ కోసం కేటాయించినంతగా అయినవారి కోసం తాను ఎప్పుడూ అంత సమయం ఇవ్వలేదని. కానీ ఉత్తరాల్లో ఉన్న బలం అలాంటిది కాదు. ఒక ఉత్తరం ఎన్నో అనుబంధాలను మోసుకొచ్చేది. ఎన్నో అనురాగాలను పెనవేసుకుపోయే బలాన్నిచ్చేది. అందుకే వీలైతే అయినవారికి, స్నేహితులకు మళ్లీ లేఖలు రాయడం మొదలుపెట్టండి. అందులోని అనుభూతిని ఆస్వాదించండి. ఎవరికి రాయాలో అర్థం కాకపోతే, డియర్ జిందగీకే మీ మొదటి లేఖ రాయండి. మీ అభిప్రాయాలను పంచుకోండి. 


చిరునామా:
డియర్ జిందగీ
(దయాశంకర్ మిశ్రా)
జీ మీడియా, 
వాస్మే హౌజ్, ఫ్లాట్ నెం.4,
సెక్టార్ 16 ఏ, ఫిలిం సిటీ, నొయిడా (ఉత్తర్ ప్రదేశ్)


ఈ ఆర్టికల్‌ని హిందీలో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి :- डियर जिंदगी : वह ख़त क्‍या हुए…


सभी लेख पढ़ने के लिए क्लिक करें : डियर जिंदगी


(https://twitter.com/dayashankarmi)


(ఈ ఆర్టికల్‌పై మీ సలహాలు, సూచనలు తెలియచేయండి: https://www.facebook.com/dayashankar.mishra.54)