ఏరోజు ఏదేవుడికి పూజచేయాలి?
భక్తులు ఏ రోజు ఏ దేవుడిని పూజిస్తే పుణ్యం వస్తుందో తెలిస్తే.. ఆ పూజ చేయడం ఉత్తమం. కానీ ఈ విషయంపై చాలా కొద్దిమందికి మాత్రమే అవగాహన ఉంటుంది. మరికొందరు ఎవరో చెప్తే గానీ అవునా ..! అని అనుకొని పూజలు చేస్తుంటారు.
అయితే ఏ రోజు ఏ దేవుడిని పూజిస్తే పుణ్యం సిద్ధిస్తుందో శివమహా పురాణంలో క్లుప్తంగా వివరించారు. ఆ పూజలు చేస్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని కూడా అందులో ఉంది. వారానికి ఏడు రోజులు. అలాగే ఆ ఏడు రోజులకు ఏడు దైవాలను విధిగా పూజించాలి
* ఆదివారం: ఆదివారం ఆదిత్యుడిని పూజించాలి. ఆదిత్యుడంటే సూర్య భగవానుడు. ఆదిత్యుడిని పూజించి వేదపండితులకు షడ్రషోపేతమైన భోజనం పెట్టాలి. ఈ పూజవల్ల శిరోభార ఇత్యాది రోగనివారణ జరుగుతుంది.
* సోమవారం: సోమవారం సంపద సిద్దించాలంటే లక్ష్మీదేవిని పూజించాలి. పూజ అనంతరం వేదపండితులకు నెయ్యితో భోజనం పెట్టాలి.
* మంగళవారం: మంగళవారం కాళీదేవతను పూజించాలి. మినపప్పు, పెసరపప్పుతో చేసిన వంటలను వేదపండితులకు వడ్డించాలి. ఈ పూజ వల్ల దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయి.
* బుధవారం: బుధువారం విష్ణువును పూజించాలి. పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి. ఈ పూజ, నివేదనతో పిల్లలు, భార్య, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆయురారోగ్యాలను అనుభవిస్తారు.
* గురువారం: గురువారం మీకిష్టదైవాన్ని పూజించాలి. పాలు, నెయ్యితో చేసిన ఆహారపదార్థాలను నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడంవల్ల ఆయుష్షు పెరుగుతుంది.
* శుక్రవారం: శుక్రవారం కూడా ఇష్టదైవాన్ని పూజించి.. వేదపండితులకు షడ్రుచులతో భోజనం పెట్టాలి. స్త్రీలకు వస్త్రాలు కూడా బహుకరించవచ్చు.
* శనివారం: శనివారం రుద్రాది దేవతలను ఆరాధించాలి. నువ్వుల హోమం చేసి, నువ్వులను దానం చేయాలి. నువ్వులతో చేసిన ఆహారపదార్థాలను వేదపండితులకు వడ్డించాలి. ఇలా చేయడం వల్ల చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది.