18 ఏళ్లుగా సింగపూర్ పోలీసులను వేధించిన ఎన్నారై తాగుబోతు
భారతీయ సంతతికి చెందిన ఎన్నారై గురుచరణ్ సింగ్ తాగుడుకు బానిసై... ఆ మత్తులో ప్రాంక్ కాల్స్ చేయడానికి బాగా అలవాటుపడ్డాడు.
భారతీయ సంతతికి చెందిన ఎన్నారై గురుచరణ్ సింగ్ తాగుడుకు బానిసై... ఆ మత్తులో ప్రాంక్ కాల్స్ చేయడానికి బాగా అలవాటుపడ్డాడు. సింగపూర్‌లో స్థిరపడిన గురుచరణ్... ఆ దేశ పోలీసులతో పాటు ప్రభుత్వ సంస్థలకు 18 సంవత్సరాలుగా ప్రాంక్ కాల్స్ చేస్తూ దొరకకుండా తప్పించుకున్నాడు. ఎట్టకేలకు 2016లో గురుచరణ్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు పోలీసులు. సింగపూర్ కోర్టు అతనికి రెండు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే సింగ్ జైలు నుండి బయటకు వచ్చాక కూడా తన అలవాటును మానలేకపోయాడు.
అందుకే ఈ మధ్యకాలంలో వేరు వేరు నెంబర్లతో మళ్లీ పోలీసులకు ప్రాంక్ కాల్స్ చేయడం ప్రారంభించాడు. ఇటీవలే సింగపూర్ పోలీసులు మళ్లీ గురుచరణ్‌ను అరెస్టు చేశారు. అతన్ని అరెస్టు చేసినప్పుడు గురుచరణ్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని.. పూర్తిగా మత్తులో జోగుతున్నాడని.. తన ఇంటి నిండా లెక్కలేనన్ని బీరు క్యాన్లు ఉన్నాయని తెలిపారు పోలీసులు. ఈసారి ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్న కోర్టు గురుచరణ్‌ను వివరణ అడగ్గా.. ఆయన ఈ పని మానలేకపోతున్నానని తెలిపాడు.
మద్యానికి బానిసైన వ్యక్తులు ఇలాంటి పనులు కావాలని చేస్తారని తాము భావించమని.. ఇలాంటి వ్యక్తులకు మానసిక చికిత్స అందించాల్సిన అవసరం ఉందని సింగపూర్ కోర్టు తెలిపింది. అయితే ఏదైనా నేరం నేరమే కాబట్టి.. మళ్లీ గురుచరణ్ సింగ్‌కు మూడు సంవత్సరాలు కారాగార శిక్ష విధించింది. అలాగే ఒకసారి శిక్షను అనుభవించి విడుదలై బయటకు వచ్చి కూడా మళ్లీ అదే నేరం చేసినందుకు... ఈ మూడు సంవత్సరాలకు అదనంగా 66 రోజులు కారాగార శిక్షను అనుభవించాలని తెలిపింది. తాగుబోతులు ఇలాంటి పనులకు అలవాటు పడడం వల్ల ప్రభుత్వ కార్యకలాపాలకు ఎనలేని ఇబ్బంది చేకూరుతుందని.. పోలీస్ కాల్ సెంటర్లు, హెల్త్ కాల్ సెంటర్ల జోలికి వస్తూ.. తప్పుడు సమాచారం ఇచ్చే ఇలాంటి క్రిమినల్స్‌ను ఉపేక్షించరాదని కోర్టు తెలిపింది.