దుబాయ్ లో విదేశీయుల ప్రాపర్టీ కొనుగోళ్లలో భారతీయులు ముందంజలో ఉన్నారు. గతేడాది 2016 జనవరి నుంచి ఈ ఏడాది 2017 జూన్ వరకు భారతీయులు దుబాయ్ లో రూ.42వేల కోట్ల విలువైన ఆస్తులను దక్కించుకున్నారు. భారతీయుల్లో ఎక్కువమంది అపార్ట్మెంట్లపై, మరికొందరు విలాలపై ఆసక్తిని చూపిస్తున్నారట. ఈ విషయం అక్కడి ల్యాండ్ డిపార్ట్మెంట్ వెల్లడించిన లెక్కల ద్వారా స్పష్టమవుతోంది.   


ముంబై (మహారాష్ట్ర) , పూణే (మహారాష్ట్ర), అహ్మదాబాద్ (గుజరాత్) ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా దుబాయ్ లో ఆస్తులు కొనడానికి ఇష్టపడుతున్నారు. అపార్ట్మెంట్, విల్లాల కోసం కోట్లు ఖర్చు పెట్టడానికి సైతం సిద్ధమవుతున్నారు. వీరిలో ఎక్కువగా అపార్ట్మెంట్, విల్లాలకు ఆరున్నర కోట్లు వెచ్చిస్తున్నారు. మరికొంత మంది 65 లక్షల నుంచి 3. 25 కోట్ల రూపాయలతో ఆస్తులు కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు అని దుబాయ్ ప్రాపర్టీ షో అధ్యయనం తెలిపింది. దీనికంతటికి కారణం ఇన్వెస్టర్లకు ధరలు అందుబాటులో ఉండటం, రూపాయి పుంజుకోవడం అని తేల్చింది.