తమిళనాడు కోయంబత్తూరు ప్రాంతానికి చెందిన శశి చెల్లయ్య సింగపూర్‌లో పెరిగాడు. తర్వాత ఆస్ట్రేలియా వలస వెళ్లాడు. అక్కడే వంటవాడిగా తన కెరీర్ ప్రారంభించాడు. ఇటీవలే ఆస్ట్రేలియాలో జరిగిన మాస్టర్ చెఫ్ పోటీలలో పాల్గొన్న చెల్లయ్య తన ప్రతిభను కనబరిచి రకరకాల వంటలను తయారుచేసి న్యాయనిర్ణేతల మెప్పు పొందాడు. ఫైనల్ రౌండ్ వరకు ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన మాస్టర్ చెఫ్ పోటీల్లో తన ప్రత్యర్థి బెన్ బోర్స్ట్ పై అత్యధిక స్కోరుతో శశి చెల్లయ్య గెలుపొందడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉద్యోగ రీత్యా జైలర్‌గా ఆస్ట్రేలియాలో పనిచేస్తున్న చెల్లయ్య... సింగపూర్‌లో 12 సంవత్సరాలు పోలీస్ అధికారిగా కూడా సేవలందించాడు. అయితే వంట చేయడం అంటే ఎంతో ఆసక్తిని కనబరిచే చెల్లయ్య అనేక కాంటినెంటల్, చైనీస్, ఇండియన్ వంటకాలు చేయడంలో సిద్ధహస్తుడు. తాజాగా మాస్టర్ చెఫ్ టైటిల్ గెలిచిన శశి చెల్లయ్యకు ప్రైజ్ మనీ క్రింద 250,000 డాలర్లు కూడా అందించడం జరిగింది. ఈ టైటిల్ గెలిచినందుకు తనకు ఎంతగానో సంతోషంగా ఉందని శశి చెల్లయ్య తెలిపారు.


ఈ సందర్భంగా శశి చెల్లయ్య మాట్లాడుతూ "నాకు నా కుటుంబం అందించిన శక్తి, సామర్థ్యాలు, ప్రోత్సహం వల్ల ఇంత గొప్ప విజయం సాధించడం సాధ్యమైంది. మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా గెలవడం అనేది నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఇది నిజంగానే నా జీవితంలో జరిగిన అద్భుతమైన విషయం" అని చెల్లయ్య తెలిపారు. త్వరలోనే తనకు వచ్చిన ప్రైజ్ మనీతో ఆస్ట్రేలియాలో సౌత్ ఈస్ట్ ఏషియన్ ఫ్యూజన్ రెస్టారెంట్ ప్రారంభిస్తానని కూడా తెలిపారు ఈ కోయంబత్తూర్ నలభీముడు.