సమాచార హక్కు చట్టంలో కీలక మార్పు చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఈ చట్టం ద్వారా భారతీయులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది.. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎన్నారైలు కూడా ఆర్‌టీఐ కింద పాలనా పరమైన అంశాల సమాచారం కోరవచ్చు. ఈ మేరకు సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సవరించిన విధానాన్ని లోక్‌సభ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. 


సమాచార చట్టానికి ఎన్నారైలు అర్హులు కాదంటూ 2018  ఆగస్టు 8న  కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ దీన్ని పలువురు ఎన్నారైలు వ్యతిరేకించారు. ఈ అంశంపై సంబంధిత మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో దీన్ని మరోసారి పరిశీలించిన కేంద్రం... ఎన్నారైలకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇక నుంచి ఎన్నారైలు కూడా సహ చట్టం ద్వారా పాలనా పరమైన విషయాలను తెలుసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తాజా నిర్ణయంపై ఎన్నారైలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.