మారిషస్‌లో తెలుగు వైద్య విద్యార్థి మృతి
మారిషస్‌లో తెలుగు విద్యార్థి చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
మారిషస్‌లో తెలుగు విద్యార్థి చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక్కగానొక్క బిడ్డ మృతిని తలచుకుని ఆ కుటుంబం పడుతున్న వేదన వర్ణణాతీతం. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం అన్నంగికి చెందిన పమిడి సాయిమనోజ్(19) మారిషస్‌లోని విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్నాడు. అయితే, రెండు రోజుల క్రితం ఆదివారంరోజు సెలవు కావడంతో స్నేహితులతో కలిసి జలపాతాన్ని చూసేందుకు వెళ్లారు. ఈత కొట్టేందుకు నీళ్లలోకి దిగిన మనోజ్... లోతు ఎక్కువ ఉండటంతో మునిగిపోయాడు. వెంటనే అతడ్ని కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్లగా... చికిత్స పొందుతూ చనిపోయినట్లు స్నేహితులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
ప్రభుత్వం సహకారమందించాలి
మనోజ్ మృతదేహాన్ని సొంత ఊరికి తరలించేందుకు ప్రభుత్వం సహకారం అందించాల్సిందిగా వెంకటస్వామి దంపతులు ప్రభుత్వ పెద్దలను విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని తొలుత స్థానిక రెవిన్యూ డివిజనల్ అధికారి కమ్మ శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. అలాగే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం అందించనున్నారు.