School Holidays: ఆ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్.. స్కూళ్లకు రెండు రోజులు సెలవు..?
AP Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో APలోని దక్షిణ కోస్తా జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో శుక్ర, శనివారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది.
ఈ క్రమంలోనే APలోని పలు జిల్లాలకు వాతవారణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వర్షాలు తగ్గకపోతే.. సోమ, మంగళ వారాలు సెలవు ప్రకటించనున్నారు.
అదే సమయంలో నెల్లూరు జిల్లాలో ఆకస్మిక వరదలు రావొచ్చని, ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.
మరో వైపు APకి తుపాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రతికూల పరిస్థితులతో తుపానుగా మారలేదు. ఇది శ్రీలంకలోని ట్రింకోమలీకి 200 కి.మీ, నాగపట్టణానికి 340, పుదుచ్చేరికి 410, చెన్నైకి 470 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. నేడు అంటే శుక్రవారం ఉదయం వరకు తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుందని తెలిపింది.
సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. వాయవ్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికల్లా పుదుచ్చేరి , తమిళనాడులోని మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది.