Gold Delivery: బిగ్‌బాస్కెట్ బంపర్ ఆఫర్.. 10 నిమిషాల్లో బంగారం, వెండి మీ ఇంటికే డెలివరీ
అక్టోబర్ 31న దీపావళి పండుగ రానుంది. ఇదిలా ఉండగా రేపు ధనత్రయోదశి సందర్భంగా చాలామంది బంగారం, వెండి వారి శక్తి మేరకు కొనుగోలు చేస్తారు. ఈరోజు బంగారం కొంటే రెట్టింపు లాభాలు పొందుతారనే నమ్మకం ఉంది.
అంతేకాదు దీపావళి పండుగ రోజు లక్ష్మీ దేవి పూజ చేస్తారు. కాబట్టి ధన త్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేస్తే ఇంటికి స్వయంగా లక్ష్మీ దేవి ఆహ్వానించినట్లవుతుందని నమ్మకం. అందుకే ఈరోజు బంగారం వెండి కొనుగోలు చేస్తారు.
అయితే, బంగారం కొనడానికి ఇకపై దుకాణాలకు వెళ్లి గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పనిలేదు. ఆన్‌లైన్ డెలివరీ పార్టనర్ బిగ్ బాస్కెట్ మీకు గోల్డ్,వెండి కాయిన్‌లను కేవలం పది నిమిషాల్లో డెలివరీ చేయనున్నారు.
గోల్డ్ విక్రయ సంస్థ అయిన తనిష్క్ భాగస్వామ్యంతో ఈ డెలివరీ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ గోల్డ్ డెలివరీని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింక్‌ఇట్‌లో విక్రయాలు చేశాయి. బిగ్ బాస్కెట్ తనిష్క్‌తో కలిసి ఈ వినూత్న ప్రయోగానికి తెరతీసింది. అయితే, షాపులకు వెళ్లకుండానే 999.9 స్వచ్చమైన బంగారం, పది గ్రాముల వెండి నాణెం డెలివరీ చేయనుంది.
పెరుగుతున్న పోటీ నేపథ్యంలో ఈ కొత్త ప్రయోగాలకు తెరతీసింది. ఇప్పటి వరకు కేవలం ఫుడ్ డెలివరీ, గృహోపకరణాలు విక్రయించిన లాజిస్టిక్ కంపెనీలు నేడు గోల్డ్, సిల్వర్ విక్రయాలు కూడా జరుపుతోంది. దీంతో కస్టమర్లు ఇళ్లు కదలకుండానే ధనత్రయోదశి, దీపావళి రోజు బంగారం కొనుగోల చేయవచ్చు.