Bitcoin 75k Milestone: బిట్ కాయిన్ @75000 డాలర్స్.. రికార్డు స్థాయిలో పెరిగిన క్రిప్టో కరెన్సీలు.. ట్రంప్ ఎఫెక్ట్ క్రిప్టో మార్కెట్ పై ఎంత ఉంటుంది
cryptocurrency market: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం క్రిప్టో కరెన్సీలకు చాలా బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ఊపు తగ్గిన క్రిప్టో కరెన్సీలకు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవుతున్నాడు అనే వార్తలతో ఒక్కసారి ఊపందుకున్నాయి. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీల్లో సింహభాగం వాటా కలిగి ఉన్న బిట్ కాయిన్ ఏకంగా 75 వేల డాలర్ల స్థాయిని తాకింది.
ఇది బిట్ కాయిన్ చరిత్రలో ఆల్ టైం రికార్డ్ స్థాయిని చెప్పవచ్చు. నిజానికి 2024 మార్చి నుంచి బిట్ కాయిన్ జోరు ప్రారంభం అయింది. ఈ ఏడాది ప్రారంభంలో బిట్ కాయిన్ కేవలం 38వేల డాలర్ల వద్ద మాత్రమే ఉంది. కానీ అనూహ్యంగా అమెరికాలో తలెత్తిన పరిస్థితులు, అలాగే డోనాల్డ్ ట్రంప్ విజయాన్ని ముందుగానే పసిగట్టిన ఇన్వెస్టర్ల ముందు చూపుతో క్రిప్టో కరెన్సీ లో ట్రేడింగ్ అనూహ్యంగా పెరిగింది.
నిజానికి డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు క్రిప్టో కరెన్సీ లలో పెద్ద మొత్తంలో చలనం కనిపించింది. ఒకానొక దశలో క్రిప్టో కరెన్సీల కోసం అధికారిక ఎక్స్చేంజ్ కూడా ఓపెన్ చేశారు. ట్రంప్ హయాంలోనే బిట్ కాయిన్ జోరుగా అందుకుంది. దాంతోపాటు ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఆకర్షించి ఇన్వెస్టర్లకు లాభాలను పంచడం ప్రారంభించాయి.
ఇతర క్రిప్టో కరెన్సీలుగా చలామణి అవుతున్న ఇథీరియం, టెథార్, సొలానా, బీఎన్‌బీ, డోజ్ కాయిన్, కార్డానో వంటి కాయిన్లు సైతం ట్రంప్ రాకతో ఈరోజు ట్రేడింగ్ లో భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. వీటిలో ముఖ్యంగా ట్రంప్ సన్నిహితుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మద్దుతుగా నిలిచిన డోజీ కాయిన్ ఈ రోజు భారీగా పెరిగింది. 24 గంటల్లోనే ఈ డోజీ కాయిన్ ధర 16 శాతం పెరిగింది.
ట్రంప్ సర్కార్ క్రిప్టో కరెన్సీలకు ప్రోత్సాహం అందిస్తుందని, అందులోను ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్ క్రిప్టో కరెన్సీ లకు మొదటి నుంచి కూడా వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో సాంప్రదాయ బ్యాంకింగ్ ఇన్వెస్ట్మెంట్ కు భిన్నంగా ఉండే, క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడులను ట్రంప్ సర్కార్ ప్రోత్సహిస్తుందని ఇన్వెస్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు క్రిప్టో కరెన్సీ ల వల్ల పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు ఆర్బీఐ గవర్నర్..శక్తి కాంత్ దాస్ సైతం ఈ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కల్పితమని, ఇలాంటి ఊహాజనిత ట్రేడింగ్ విధానం ఆర్థిక వ్యవస్థకు నష్టమని, పలుమార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు ట్రంప్ సర్కార్ క్రిప్టో కరెన్సీ లను ఏ విధంగా నిర్వహిస్తుంది ఎలాంటి మద్దతు ఇస్తుందో వేచి చూడాల్సిందే. మరోవైపు సాంప్రదాయ ఇన్వెస్ట్మెంట్ సాధనాలైన స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, బంగారం వంటి అసెట్ క్లాసెస్ నుంచి పెట్టుబడులు నెమ్మదిగా క్రిప్టో కరెన్సీ ల పైపు పెద్ద ఎత్తున కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.