Gold Rate Today : భారీగా తగ్గుతున్న బంగారం ధర..శ్రావణమాసంలో రూ.64వేలకు పడిపోయే ఛాన్స్ ..!!
Gold Rate Today: కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఎప్పుడైతే బంగారం దిగుమతి సుంకం పైన ఒక్కసారిగా పన్నులను తగ్గించిందో, అప్పటినుంచి బంగారం ధరలు వరుసగా పతనం అవుతూనే ఉన్నాయి. తాజాగా బంగారం ధరలను మనం గమనించినట్లయితే గతంలో ఉన్న గరిష్ట స్థాయి రూ. 75 వేల నుంచి సుమారు 68 వేల వరకు తగ్గింది. అంటే గత వారం రోజుల్లోనే బంగారం ధర ఏకంగా రూ.7 వేల వరకు తగ్గింది. ఇది ఒక రకంగా రికార్డు అని చెప్పాలి. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ముఖ్యంగా పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు.
ఎందుకంటే బంగారం ధరలు గడచిన ఏడాదికాలంగా భారీగా పెరుగుతూ వచ్చాయి.ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి.ఈ సంవత్సరమే బంగారం ధర గరిష్టంగా 10 గ్రాములకు గాను రూ. 75 వేల చారిత్రక గరిష్ట స్థాయిని నమోదు చేసింది.ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగినట్లయితే బంగారం ధర రూ.1 లక్ష దాటడం ఖాయమని అందరూ అంచనా వేశారు.
కానీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బంగారం దిగుమతి సుంకం పైన 4 శాతం కోత విధించింది. దీంతో ఒక్కరోజే బంగారం ధర సుమారు 4000 రూపాయల వరకు తగ్గింది. అక్కడి నుంచి పతనం అవుతూ బంగారం ధర రూ.68 వేల రేంజుకు దిగింది. ప్రస్తుతం బంగారం ధర కాస్త రికవరీ స్థాయిలో ఉంది.
గత రెండు రోజులుగా బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ. 69 వేల వద్ద ట్రేడవుతోంది. MCX ఆగస్టు 5 గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 68,275 వద్ద స్థిరంగా ఉంది.ఇది బంగారం ధరలు తగ్గుముఖం పట్టే దిశగా సాగుతున్నట్లు సూచిస్తుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 69,170గా ఉంది. సోమవారం రూ. 69,140 పలికింది. అంటే బంగారం ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 కేరట్ల రూ.69,200గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,450గా ఉంది.
శ్రావణమాసం ప్రారంభమైనందుకు మరికొన్ని రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. శ్రావణమాసం అంటేనే వివాహాది శుభకార్యాలకు మంచి సీజన్.ఈ సీజన్లో దాదాపు అన్ని రోజులు వివాహానికి అనుకూలంగా ఉంటుంది. దీంతో పసిడి వ్యాపారులు పండగ చేసుకుంటున్నారు.
శ్రావణమాసం అనంతరం వచ్చే భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక మాసాల్లో దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలు రానున్నాయి.ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు బంగారం కొనుగోలు చేయాలని ఆశిస్తూ ఉంటారు. అయితే బంగారం ధరలు శ్రావణమాసంలో మరింత తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర ఒక ఔన్సు ( సుమారు 31 గ్రాములు) 2380 డాలర్ల వద్ద ఉంది.ఈ స్థాయి నుంచి బంగారం ధర మరో 50 డాలర్లు తగ్గినట్లయితే, పసిడి ధరలు అంతర్జాతీయంగా కూడా భారీగా తగ్గి వచ్చే అవకాశం ఉంటుంది.