Dhanteras 2024: ధనత్రయోదశి రోజు ఇలా చేస్తే సర్వ సమస్యలు దూరం..!
హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు ధన త్రయోదశి. ఈరోజు అక్టోబర్ 29 కావడంతో భక్తులు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి పలు ప్రయత్నాలు చేస్తుంటారు. హిందూ సాంప్రదాయంలో ఈ ధన త్రయోదశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనినే ధంతేరాస్ అని కూడా పిలుస్తారు.
ఆశ్వయుజ మాసం కృష్ణపక్షంలోని త్రయోదశి స్థితి నాడు ధన త్రయోదశి పండుగను జరుపుకుంటారు. ఏడాది అక్టోబర్ 29వ తేదీ మంగళవారం వచ్చింది. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ ధన త్రయోదశి తిధి రోజున చాలామంది లక్ష్మీ పూజ చేస్తారు.. అలాగే సాయంత్రం ఇంటి గుమ్మం ముందు బలి దీపం వెలిగిస్తూ ఉంటారు.
ఈ బలి దీపం ఎలా వెలిగించాలో.. దీని ప్రాముఖ్యత ఏమిటో ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ తెలియజేశారు. మరి ఆయన చెప్పిన వివరాల మేరకు ఈ బలి దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు చూద్దాం.
ముందుగా ఒక గిన్నెలోకి కొద్దిగా గోధుమపిండి తీసుకొని, అందులో బెల్లం తురుము , పచ్చి ఆవు పాలు వేసి ముద్దగా చేసి దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. పిండి దీపాన్ని ఇంటి గుమ్మం ముందు పెట్టి అందులో నువ్వుల నూనె పోసి దక్షిణం దిక్కు వైపు దీపం వెలిగేలా ఎన్ని వత్తులైనా వేసి దీపం వెలిగించవచ్చు.ఇలా గోధుమ పిండితో వెలిగించే దీపాన్ని బలి దీపం అని పిలుస్తారు.
ఇక బలి దీపం వద్ద నిర్వహించాల్సిన విధుల విషయానికి వస్తే.. బలి దీపం దగ్గర ఒక తమలపాకు పెట్టి, అందులో రాగి నాణెం లేదా రూపాయి నాణెం పెట్టాలి. అలాగే గవ్వ కూడా ఉంచాలి. దీపంలో నాణెం ,గవ్వవేసి కూడా వెలిగించవచ్చు. అలాగే బలి దీపం దగ్గర తమలపాకులో కొద్దిగా బియ్యం, బెల్లం కూడా నైవేద్యంగా పెట్టాలి.
దీపం కొండెక్కిన మరుసటి రోజు స్నానం చేసి పిండి దీపం, గవ్వ, నాణెం, నైవేద్యం ఎవరు తొక్కనిచోట ఒక చెట్టు కింద అయినా లేదా పారే నీళ్లలో అయినా విడిచి పెట్టాలి. ఇలా చేస్తే యమధర్మరాజు అనుగ్రహం పొందడమే కాకుండా బలి దీపం వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తం ఇంట్లోని కుటుంబ సభ్యులకు అప మృత్యు దోషాలు తొలగిపోతాయట. పితృ, మాతృ దోషాలు తొలగిపోతాయని సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని పండితులు చెబుతున్నారు.