Did Sonu Sood mortgage his properties: నిరుపేదలకు సాయం చేసేందుకు సోనూ సూద్ ఆస్తులు తనఖా పెట్టి రుణం తీసుకున్నాడా ?
సోనూ సూద్ సినిమాల్లో వేసేది విలన్ వేషమే అయినప్పటికీ.. నిజ జీవితంలో మాత్రం ఎంతో మందికి ఎంతో సాయం చేసి వారి దృష్టిలో దేవుడయ్యాడు.
విదేశాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులను భారత్‌లో వారి సొంతింటికి చేర్చాడు. దేశంలోని ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్.. ఇలా దేశం నలుమూలలా చిక్కుకుని సొంతూర్లకు వెళ్లాలని కోరుకున్న వాళ్ల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి మరీ వారిపాలిట దేవుడయ్యాడు.
అయితే, లాక్ డౌన్ కాలంలో నిరుపేదలకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన సోనూ సూద్.. అందుకోసం ముంబైలోని జుహూలో ఉన్న 8 ఆస్తులను తనకా పెట్టాడనే టాక్ వినిపిస్తోంది.
జుహూ అంటేనే ముంబైలో అత్యంత ఖరీదైన ప్రాంతం. సినీ ప్రముఖులు, రాజకీయ నేతల నుంచి బిలియన్లకు పడగలెత్తిన వ్యాపారులు నివాసం ఉండే ఖరీదైన ప్రాంతం.
అలాంటి జుహూలో ఉన్న ఆస్తులను తనఖా పెట్టి మరీ నిరుపేదలకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడా అంటే అవుననే తెలుస్తోంది. జుహూలో తనతో పాటు తన భార్య సొనాలి సూద్ జాయింట్ ఓనర్స్‌గా ఉన్న 8 ప్రాపర్టీస్‌ని సోనూ సూద్ తనఖా పెట్టినట్టు వార్తలొస్తున్నాయి.
సోనూసూద్ తనఖా పెట్టిన ఆస్తుల్లో రెండు దుకాణాలు కాగా మరో 6 నివాస యోగ్యమైన ఫ్లాట్స్ ఉన్నాయని సమాచారం.
ముంబైలోని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులో సెప్టెంబర్ 15న మార్టగేజ్ లోన్ ( Mortgate loan ) కోసం సోనుసూద్ దరఖాస్తు చేసుకున్నాడనేది సదరు మీడియా కథనాల సారాంశం.
నిరుపేదలకు అవసరమైన సహాయం చేయడం కోసం అవసరమైన రూ. 10 కోట్ల నిధులను సమకూర్చుకోవడం కోసమే జుహూలో ఆస్తులను మార్టగేజ్ చేసినట్టు ముంబై మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.