Dum Biryani: చికెన్, మటన్ బిర్యానీ తిని బోర్ కొట్టిందా..టమాటలతో దమ్ బిర్యానీ ట్రై చేయండి..టేస్ట్ వేరే లెవల్ అంతే
Dum Biryani with Tomatoes: బిర్యానీ అంటే ఇష్టపడనివారండరంటే అతిశయోక్తి కాదు. బిర్యానీ పేరు వింటేనే నోట్లో నీళ్లూరుతాయి. మాంసాహారులు అయితే మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ ఇలా బోలెడు ఉంటాయి. వెజిటేరియన్స్ కు కూడా లెక్కలేనన్ని బిర్యానీ వెరైటీలు ఉన్నాయి. అయితే ఈసారి మటన్, చికెన్ కాకుండా టమాటాలతో దమ్ బిర్యానీ ట్రై చేద్దాం. టమాటాలతో ఘమఘమలాడే దమ్ బిర్యానీ మీరూ ఓసారి ట్రై చేయాలంటే ఎలా చేయాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు బాస్మతి బియ్యం - 2 కప్పులు, టమాటాలు-8 ప్యూరీ కోసం 4 టమాటాలు, 4 దమ్ బిర్యానీలోకి కట్ చేసుకోవాలి, చిన్న అల్లం ముక్కలు -2, వెల్లుల్లి రెబ్బలు-10,నూనె-2 టేబుల్స్పూన్లు, నెయ్యి-2 టేబుల్స్పూన్లు, ఉల్లిపాయలు-2, కారం -2 టేబుల్స్పూన్లు, ధనియాల పొడి-టీస్పూన్, పసుపు-చిటికెడు, జీలకర్ర పొడి - అరటీస్పూన్, గరం మసాలా - అరటీస్పూన్, కొత్తిమీర, పుదీనా తరుగు -కొద్దిగా, పెరుగు -2 టేబుల్స్పూన్లు, కొద్దిగా కుంకుమ పువ్వు వాటర్
దమ్ బిర్యానీలోకి మసాలా దినుసులు బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క, మిరియాలు -5, షాజీరా-టీస్పూన్, లవంగాలు-3, యాలకులు-3, మరాఠి మొగ్గలు-2, కొంచెం జాపత్రి
తయారీ విధానం : ముందుగా బాస్మతి బియ్యాన్ని బాగా కడిగి నీళ్లు పోసి అరగంటసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి నాలుగు గ్లాసుల నీళ్లు పోసుకుని వేడి చేసుకోవాలి. నీరు మరుగుతున్న సమయంలో 4 టమాటాలు వేసి ఉడికించుకోవాలి. తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత పైన పొట్టు తీయాలి.వీటిని మిక్సీ గిన్నెలో వేసి అందులో అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
అదే నీళ్లలో అన్నం ఉడికించుకునేందుకు కావాల్సిన మసాలా దినుుసలు, కొద్దిగా ఉప్పు వేసి మరగనివ్వాలి. ఇందులో నానబెట్టిన బియ్యం వేసి 80శాతం ఉడికించి రైసును జాలి గరిటె సహాయంతో మరో గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టౌపై గిన్నె పెట్టి అందులో నూనె, నెయ్యి వేసుకుని వేడి చేయాలి. ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి గోల్డ్ కలర్ వచ్చేందుకు వరకు ఫ్రై చేయాలి.
తర్వాత మసాల దినుసులు వేసి కలిపి అందులో టమాటప్యూరీ వేసి మిక్స్ చేయాలి. నిమిషం తర్వాత టమాట ముక్కలు వేయాలి. కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, జీలకర్రపొడి, గరం మసాలా, పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. స్టౌ మీడియం ఫ్లేమ్ లో పెట్టి టమాటాలకు మసాలా పట్టేలా కలపాలి. ఉడికిన రైస్ వేయాలి. పైన్ ఆనియన్స్ , కొత్తిమీర, పుదీనా, కుంకుమ పువ్వు వేసి వాటర్ చల్లి మూతపెట్టాలి. అంతే సింపుల్ టమోటా దమ్ బిర్యానీ రెడీ