AP Rains: ఏపీలో కుండపోత వానలు.. ఈ జిల్లాలకు హై అలర్ట్..
ఈ నేపథ్యంలో రాగల 48 గంటల్లో ఇది తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనించే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈ నెల 29 వరకు కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని చెప్పారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని విపత్తు నిర్వహన సంస్థ సూచించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి రేపు, ఎల్లుండి 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ఏపీఎస్డీఎంఏ వివరించింది.
ఇక ఈ రోజు, రేపు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ నెల 28న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తన బులెటిన్ లో పేర్కొంది.
నవంబరు 29న గుంటూరు,చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు... విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం మన్యం, అల్లూరి, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.