EPFO: దేశంలో పెరుగుతున్న మహిళా ఉద్యోగులు..ఈ లెక్కలే ఫ్రూఫ్!
EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సెప్టెంబర్‌లో 18.81 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 9.33 శాతం ఎక్కువ. సంఘటిత రంగంలో ఉద్యోగాలు పెరిగాయని ఈ రిపోర్టు తెలియజేస్తోంది. EPFO పేరోల్ డేటా ప్రకారం, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెప్టెంబర్ 2024లో 9.47 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చుకుంది.
ఇది సెప్టెంబర్ 2023 కంటే 6.22 శాతం ఎక్కువ. కొత్త సభ్యత్వం పెరగడానికి ఉపాధి అవకాశాలు పెరగడం, ఉద్యోగుల ప్రయోజనాలపై అవగాహన పెరగడం EPFO ప్రమోషనల్ ప్రోగ్రామ్‌లు కారణమని పేర్కొంది.
ప్రకటన ప్రకారం, EPFO సెప్టెంబర్, 2024 కోసం తాత్కాలిక 'పేరోల్' డేటాను విడుదల చేసింది. దీని కింద 18.81 లక్షల మంది సభ్యులు సామాజిక భద్రతా పథకంలో చేరారు. ఇది 2023 సెప్టెంబర్‌తో పోలిస్తే 9.33 శాతం ఎక్కువని చెప్పవచ్చు. గణాంకాల ప్రకారం 18 నుండి 25 సంవత్సరాల వయస్సు గల వారు ఎక్కువగా ఉన్నారు.
సెప్టెంబర్ 2024లో చేర్చిన మొత్తం కొత్త సభ్యులలో వారి వాటా 59.95 శాతంగా ఉంది. సెప్టెంబర్ 2024కి 18 నుంచి 25 ఏళ్ల మధ్య 8.36 లక్షల మంది సభ్యులు చేరారని తెలిపింది.
ఇది సెప్టెంబర్ 2023 గణాంకాల కంటే 9.14 శాతం ఎక్కువగా ఉంది. ఇది మునుపటి ట్రెండ్‌కు అనుగుణంగా ఉంది. సంఘటిత వర్క్‌ఫోర్స్‌లో చేరిన వ్యక్తులలో ఎక్కువ మంది యువతే ఉన్నారు. వీరంతా మొదటిసారిగా ఉద్యోగంలో చేరినవారే అవ్వడం గమనార్హం. డేటా ప్రకారం, దాదాపు 14.10 లక్షల మంది సభ్యులు విత్ డ్రా చేసుకుని..మరలా తిరిగి EPFOలో చేరారు. వార్షిక ప్రాతిపదికన ఈ సంఖ్య 18.19 శాతం ఎక్కువ.
స్త్రీ పురుషుల ప్రాతిపదికన నెలలో దాదాపు 2.47 లక్షల మంది మహిళలు కొత్త సభ్యులుగా చేరారు. వార్షిక ప్రాతిపదికన ఇది 9.11 శాతం ఎక్కువ. నికర మహిళా సభ్యుల సంఖ్య దాదాపు 12 శాతం పెరిగి దాదాపు 3.70 లక్షలకు చేరుకుంది. రాష్ట్రాల వారీగా పేరోల్ డేటా విశ్లేషణ ప్రకారం, మొదటి ఐదు రాష్ట్రాలు/యూటీలలో నెలలో నికర సభ్యుల వృద్ధి 59.86 శాతం లేదా 11.26 లక్షలు.
అన్ని రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. సమీక్షిస్తున్న నెలలో ఇది 21.20 శాతం నికర సభ్యులను చేర్చింది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు/యూటీలు ఈ నెలలో వ్యక్తిగతంగా ఐదు శాతానికి పైగా నికర సభ్యులను చేర్చుకున్నాయి. 'పేరోల్' ఫిగర్ తాత్కాలికమేనని చెబుతోంది. డేటా ఉత్పత్తి నిరంతర ప్రక్రియ కావడమే దీనికి కారణం.