Success Story: జ్యోతి...ఖండాంతరాల ఖ్యాతి.. అనాథాశ్రమంలో పెరిగి. .నేడు బిలియన్ డాలర్ల కంపెనీకి సీఈవో
Success Story: జ్యోతిరెడ్డి...ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొంది. ఆ ప్రతికూలతలనే ఆమె ఆవకాశాలుగా మలచుకుంది. సక్సెస్ బాటలో జెట్ స్పీడ్ దూసుకుపోయింది. జ్యోతిరెడ్డి స్వస్థలం వరంగల్ జిల్లా. తండ్రి వ్యవసాయ కూలి.చాలీచాలని సంపాదన ఆ కుటుంబానిది. ఐదుగురు సంతానంలో జ్యోతిరెడ్డి ఒకరు.
ఆకలితో నకనలాడిన రోజులు ఎన్నో ఉన్నాయి. మంచి జీవితం అందుతుందన్న ఆశతో 10ఏళ్ల వయస్సులో జ్యోతిని..ఆమె సోదరిని ఓ అనాథాశ్రమంలో చేర్పించాడు వాళ్ల తండ్రి.
ఐదేళ్లు అక్కడే పెరిగారు జ్యోతిరెడ్డి. పదవ తరగతి పూర్తయ్యింది. 16ఏళ్ల వయస్సులో ఓ రైతుతో వివాహం జరిగింది. రెండేళ్లు తిరిసే సరికి ఇద్దరు బిడ్డలకు తల్లయ్యింది. కుటుంబ పోషణ కోసం పనులు చేయాల్సి వచ్చింది. పస్తులతో ఉన్న తనలాంటి జీవితం పిల్లలకు ఉండరాదన్న తలంపుతో వ్యవసాయ కూలీగా మారింది జ్యోతిరెడ్డి.
తానూ ఎంతో కొంత సంపాదిస్తే..వారి తిండికి కొదవ ఉండదనేది జ్యోతిరెడ్డి భావన. అప్పట్లో లభించిన రోజుకూలీ ఐదు రూపాయలు మాత్రమే. ఇద్దరు బిడ్డల భవిష్యత్తు కోసం ఇది ఏమాత్రం చాలదు. ఇంకా ఏం చాలన్న ఆలోచనలు నిత్యం జ్యోతిరెడ్డిని వెంటాడుతుండేవి.
అందుకోసం వచ్చిన ఏ అవకాశాన్నీ జ్యోతిరెడ్డి వదులుకోలేదు. ఆ పట్టుదలతోనే ఓపెన్ యూనివర్సిటీ నుంచి 1994లో బీఏ పూర్తి చేసింది. తోటి రైతులకు చదువు నేర్పించింది. ఆపై ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. బిడ్డలను ఉన్నత చదువులు చదిపించాలంటే తాను కష్టపడింది చాలు అనిపించింది జ్యోతికి.
తన కజిన్ సహాయంతో అమెరికా వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంది. అందుకోసం పార్ట్ టైం జాబ్స్ చేసింది.1997లో కాకతీయ యూనివర్సీటీ నుంచి ఎంఏ పూర్తి చేసింది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కూడా నేర్చుకుంది. అమెరికాకు వెళ్లింది. అక్కడ బేబీ సిట్టర్ గా జ్యోతి మొదటి ఉద్యోగం చేసింది. సేల్స్ గర్ల్, గ్యాస్ స్టేషన్ అటెండెంట్, మోటల్ లో ఇలా రకరకాల ఉద్యోగాలు చేసింది జ్యోతిరెడ్డి.
చివరగా సాఫ్ట్ వేర్ రిక్రూటర్ గా స్థిరపడింది జ్యోతిరెడ్డి. సొంత బిజినెస్ చేసేంత సంపాదించింది. 2021లో కీ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ సంస్థను ప్రారంభించింది. వంద మంది ఉద్యోగులున్న ఆ కంపెనీ టర్నోవర్ 15మిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఇక జ్యోతిరెడ్డి ప్రతి ఏటా భారత్ వస్తుంటారు. ఆగస్టు 29న తన పుట్టినరోజు వేడుకలను పలు అనాథఆశ్రమాల్లో జరుపుకుంటుంటారు. అంతేకాదు 220 మంది మానసిక దివ్యాంగుల బాగోగులను కూడా ఆమె చూస్తుండటం విశేషం.