Kula Ganana: తెలంగాణలో ఎల్లుండి నుంచి కులగణన షురూ.. ఈ పత్రాలు రెడీ పెట్టుకోండి..
Kula Ganana: తెలంగాణలోని రేవంత్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన కొన్ని చోట్ల ఈ నెల 8 నుంచి, మరికొన్ని చోట్ల 9వ తేదీ నుంచి వివరాలు నమోదు చేయనున్నారు. సర్వేలో ఏయే అంశాలు చెప్పాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో సర్వేను పర్యవేక్షిస్తూ సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తున్నారు. మొత్తం 85 వేల మంది ఎన్యుమరేటర్లు.. 8,500 మంది సూపర్ వైజర్లు సర్వేలో పాల్గొంటున్నారు.
ఇంటి నంబరు, యజమాని పేరు నమోదు చేసే కార్యక్రమంలో ఫస్ట్ డే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికార కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొత్తం 1,17,44,954 కుటుంబాలున్నాయన్నారు. ఇళ్లను 87,092 ఎన్యూమరేషన్ బ్లాక్‌లుగా విభజించినట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ తెలిపింది.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మొత్తం 28,32,490 కుటుంబాలున్నాయి. 19,328 ఎన్యూమరేషన్ బ్లాక్‌లుగా విభజించారు. మొత్తం సర్వే పూర్తిచేయడానికి 94,750 మంది ఇన్యూమరేటర్లు, వారిపై 9,478 మంది సూపర్‌వైజర్లను గవర్నమెంట్ నియమించింది. రెండో దశ కింద ఈ నెల 9 నుంచి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం కానుంది. ప్రతి కుటుంబంలో సభ్యులందరి ఫోన్, ఆధార్ నంబర్లు సహా సమస్త వివరాలను 75 ప్రశ్నలు అడిగి నమోదు చేసి కంప్యూటరీకరణ చేస్తారు.
జిల్లా, రాష్ట్రస్థాయిలో డ్యాష్‌బోర్డులు ఏర్పాటుచేసి ఎన్ని ఇళ్ల సర్వే పూర్తయిందనే అంకెలను కలెక్టర్లు, రాష్ట్ర అధికారులు పరిశీలించి ఎప్పటికప్పుడు తగు సూచనలిస్తారు. ఇన్యూమరేటర్లు ఇంటికి వచ్చే సమయానికి ఆధార్, రేషన్‌కార్డులు సిద్ధంగా ఉంచుకుని వాస్తవ సమాచారాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఇంటింటి సర్వేలో తొలిరోజే టీచర్లకు కష్టాలు మొదలయ్యాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట దాకా స్కూళ్లలో పనులు చేసిన టీచర్లు.. మధ్యాహ్నం సర్వే బాట పట్టారు. తమకు కేటాయించిన ఇండ్లకు స్టిక్కర్లు అంటించేందుకు గ్రామాల్లోకి వెళ్లగా.. చాలా ఇండ్లు తాళాలు వేసి కన్పించాయి.
పక్కనున్న వారిని అడిగి, ఆయా ఇండ్ల యజమానుల పేర్లు తెలుసుకుని స్టిక్కర్స్ వేశారు. వరి పంట కోసేందుకు, వడ్లను ఆరబెట్టేందుకు వెళ్లడంతో ఇండ్ల దగ్గర ఎవరూ కనిపించడం లేదు. సర్వే ముగిసే వరకు ఇంటి దగ్గర ఎవరైనా ఒకరు ఉండేలా గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పించాలని టీచర్లు కోరుతున్నారు.