Obesity health issues: లావుగా ఉంటే లైంగిక సమస్యలు వస్తాయా ? లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందా ?
లావుగా ఉండటం వల్ల కేవలం గుండెకు మాత్రమే కాదు... మొత్తం శరీరానికే హానీ చేకూరుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. స్థూలకాయం వల్ల గుండె జబ్బులు అధికం అవడంతో పాటు హై బీపీ కూడా పెరుగుతోంది. మధుమేహం లాంటి జబ్బులు సైతం పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
PLOS Medicine లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. మనిషి స్థూలకాయంతో బాధపడే కాలానికి.. వారిపై దాడి చేసే జబ్బులకు సంబంధం ఉందని తేలింది. 10 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్న 20,746 మందిపై చేసిన ఈ అధ్యయనంలో విస్తుగొలిపే అనేక విషయాలు వెలుగుచూశాయి.
స్థూలకాయం సమస్యతో ఎంత ఎక్కువ కాలం బాధపడితే... అంత ఎక్కువగా గుండె సంబంధిత జబ్బులతో పాటు మధుమేహం లాంటి అనారోగ్య సమస్యలు దాడి చేస్తాయని ఈ పరిశోధనలో వెల్లడైంది.
లావుగా లేని వారితో పోల్చుకుంటే ఎక్కువ కాలం పాటు స్థూలకాయంతో బాధపడిన వారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టు ఈ పరిశోధనలో తేలింది.
స్థూలకాయం లేని వారితో పోల్చుకుంటే.. 20 నుంచి 30 ఏళ్ల పాటు లావుగా ఉండి స్థూలకాయంతో బాధపడిన వారిలో ఏకంగా 20 శాతం HbA1c ఎక్కువ ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.
స్థూలకాయం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం ఒక సమస్య అయితే.. శరీరానికి మేలు చేసే గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోవడం మరో సమస్యగా కనిపిస్తోంది.
లావుగా ఉండటం వల్ల కేవలం ఈ సమస్యలు మాత్రమే కాదు.. ఇలాంటివే ఇంకెన్నో ముఖ్యమైన ఇతరత్రా సమస్యలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లావుగా ఉండటం వల్ల శరీరంలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఇన్సూలిన్, ఇస్ట్రోజెన్, సెక్స్ హార్మోన్స్, రోగ నిరోధక శక్తిపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తాయి.
లావుగా ఉండటం వల్ల శరీరంలో కలిగే మార్పులు కొన్నిరకాల క్యాన్సర్ వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెద్ద పేగుకు వచ్చే క్యాన్సర్, థైరాయిడ్, లివర్, కిడ్నీ, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి జబ్బులు ఎన్నో స్థూలకాయంతో సంబంధం ఉన్నవే. ( Colon, uterine, rectal, ovarian, cervical, thyroid, liver, kidney and postmenopausal breast cancer )
మహిళలకు సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం ( Infertility in women ): మహిళల్లో స్థూలకాయం సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అధిక కొవ్వు కణాలు, హైపోథైరాయిడ్ వంటివి సంతానం కలగకుండా చేసే ప్రమాదం ఉందని మెడికల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
ఎక్కువ కాలం పాటు లావుగా ఉన్న మగ వారిలో సెక్స్ సామర్థ్యంపైనా దుష్ప్రభావం చూపించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థూలకాయం కారణంగా రక్త నాళాలు పనితీరు తగ్గిపోవడంతో పాటు టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోవడమే అందుకు కారణంగా వైద్యులు చెబుతున్నారు. స్థూలకాయం - సెక్స్ సామర్థ్యం సంబంధిత అంశాలపై జరిగిన అనేక పరిశోధనల్లో ఇదే ఫలితం వెలువడింది.
అధిక బరువు కారణంగా కీళ్లు, నడుం, మణికట్టులో ( knee, hip and wrist pains ) ఆస్టియోఆర్థరైటిస్ సమస్యలు తలెత్తి నొప్పులకు దారితీస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.