Aman Sehrawat: స్నానంతో 4 కిలోల బరువు తగ్గాడు.. మెడల్ కోసం అమన్ పడిన కష్టం చూస్తే కన్నీళ్లే!
పతకం చేజారకుండా || పురుషుల విభాగం రెజ్లింగ్ 57 కిలోల పురుషుల విభాగంలో యూర్టోరికా రెజ్లర్ డారియన్‌పై 13-5 తేడాతో అమన్ విజయం సాధించాడు. అయితే కాంస్య పోరుకు ముందు అమన్ తీవ్రంగా శ్రమించాడు. పది గంటల వ్యవధిలో 4.6 కిలోలు తగ్గి పతక పోరుకు అర్హత సాధించాడు. డైటీషియన్లు, కోచ్‌లు దగ్గరుండి అమన్‌ను భారీగా బరువు తగ్గేందుకు కృషి చేశారు.
సహాయక బృందం కృషి || సెమీస్‌లో ఓటమి తర్వాత కాంస్య పతక పోరులో తలపడే ముందు అమన్ బరువు చూడగా 61.5 కిలోలు ఉన్నాడు. సీనియర్ కోచ్‌లు జగమందర్ సింగ్, వీరేందర్ దహితోపాటు ఆరుగురి బృందం కష్టపడి అమన్ సెహ్రవత్ బరువును 57 కిలోలకు తగ్గించారు. వేడి నీళ్ల స్నానం.. ఆగకుండా ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్.. జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేయించారు.
విరామం లేకుండా || బరువు తగ్గేందుకు అమన్ గంటపాటు వేడినీళ్ల స్నానం చేశారు. అనంతరం ఆగకుండా ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేయించారు. అనంతరం జిమ్‌లో బరువు తగ్గే వర్కౌట్లు చేశారు. కాగా బరువు తగ్గే శ్రమ అంతా కూడా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కొనసాగడం గమనార్హం. ఈ సమయంలో అసలు నిద్ర కూడా పోలేదు.
సానా బాత్ || జిమ్ తర్వాత 30 నిమిషాల విరామం ఇచ్చారు. ఆ తర్వాత ఐదు సెషన్ల పాటు ఐదు నిమిషాల చొప్పున సానా బాత్ చేయించారు. బరువు తగ్గేందుకు కసరత్తులు చేస్తున్న సమయంలో అమన్ సెహ్రవత్‌కు కేవలం తేనే నిమ్మకాయ కలిపిన నీళ్లు మాత్రమే ఇచ్చారు. కొద్ది మోతాదులో మాత్రమే కాఫీ ఇచ్చారు. విరామం సమయంలో అమన్ సెహ్రవత్ రెజ్లింగ్‌కు సంబంధించిన వీడియోలు చూస్తూ స్ఫూర్తి పొందాడు.
ఆఖర్లో వంద గ్రాములు పోటీకి అర్హత సాధించాలంటే ఇంకా 900 గ్రాముల బరువు తగ్గాల్సి ఉంది. ఈ సమయంలో కోచ్‌లు అమన్‌తో నెమ్మదిగా జాగింగ్ చేయించారు. ఇన్ని ప్రయత్నాలు చేసిన అనంతరం 56.9 కిలోలకు చేరాడు. తాను పోటీ పడుతున్న 57 కిలోలకు వంద గ్రాములు తక్కువ ఉండడంతో అమన్ సెహ్రవత్ పోటీకి అర్హత సాధించాడు. అర్హత సాధించిన అనంతరం జరిగిన పోరులో అమన్ సత్తా చాటి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
ఒలింపిక్స్‌లో పోరు ప్రిక్వార్టర్స్‌లో యూరోపియన్ స్టార్ రెజ్లర్ వ్లాదిమిర్ ఎగోరోవ్ (ఉత్తర మెసెడోనియా) 10-0 తేడాతో విజయం సాధించగా.. క్వార్టర్ ఫైనల్‌లో అల్బేనియా రెజ్లర్ జెలిమ్ ఖాన్‌పై నెగ్గాడు. సెమీ ఫైనల్‌లో జపాన్ రెజ్లర్ రీ హిగుచి చేతిలో అమన్ తీవ్ర ఓటమి చవిచూశాడు. పతకం దక్కాలంటే తప్పక గెలవాల్సిన పోరులో ప్యూర్టోరికా రెజ్లర్ డారియన్‌పై విజయం సాధించాడు.