Movie Ticket: సినిమా టికెట్ల ధరలపై `ఇడ్లీ`ల గోల.. ప్రేక్షకులను అవమానిస్తున్న నిర్మాతలు
ప్రేక్షకుడికి అవమానం: సినీ ప్రేక్షకుడు అంటే సినిమా పరిశ్రమకు చులకన అవుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా సినిమా థియేటర్ ధరలపై నిర్మాతలు వ్యవహరిస్తున్న తీరు సగటు సినిమా ప్రేక్షకుడిని అవమానించినట్టు ఉంది.
థియేటర్లు వెలవెల: రోజురోజుకు సినిమా టికెట్ల ధరలు పెరిగిపోతుండడంతో సామాన్య, మధ్య తరగతి జీవి థియేటర్‌లకు వెళ్లడం తగ్గించేస్తున్నారు.
థియేటర్ కు దూరం: గతంలో విడుదలైన ప్రతి సినిమా చూసే ప్రేక్షకుడు ఇప్పుడు బాగా ఆలోచించి మరి థియేటర్‌లో సినిమా చూసేందుకు వెళ్తున్నాడు.
నిర్మాతల ఓవరాక్షన్: థియేటర్‌లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గడానికి కారణం సినిమా థియేటర్ టికెట్ ధర. అయితే ఈ ధరలపై నిర్మాతలు సరికొత్త నిర్వచనాలు పలుకుతున్నారు.
వింత సమాధానం: పెరుగుతున్న సినిమా థియేటర్ టికెట్ల ధరలపై ఓ కార్యక్రమంలో నిర్మాత నాగ వంశీ స్పందింస్తూ వింత సమాధానం ఇచ్చారు.
చీప్ గా దొరకదు: 'సినిమా అనేది అతి తక్కువ ఖర్చుతో కూడిన వినోద కేంద్రం. రూ.1,500కు మూడు గంటల పాటు కుటుంబం మొత్తం వినోదం దొరకదు. బడ్జెట్, నిర్మాణ వ్యయం పెరగడంతోనే టికెట్ల ధరలు కొంత పెంచుతున్నాం' అని నిర్మాత నాగ వంశీ పేర్కొన్నారు.
మరో నిర్మాత రంగంలోకి: నాగవంశీ చేసిన వ్యాఖ్యలపై మరో నిర్మాత ఎస్‌కేఎన్ స్పందించారు. సినిమా టికెట్ల ధరలను ఇడ్లీతో పోల్చి వివాదం రేపారు.
ఇడ్లీతో పోలిక: ఓ ప్రెస్‌మీట్‌లో ఎన్‌కేఎన్ మాట్లాడుతూ.. 'ఇడ్లీ బండి దగ్గర రూ.20కి లభిస్తుంది. అదే స్టార్ హోటల్‌లో రూ.200కు దొరుకుతుంది. ఎక్కడ తినాలనేది వ్యక్తిగత విషయం. మనం కోరుకునే సౌకర్యాన్ని బట్టి డబ్బులు చెల్లిస్తుంటారు. రూ.300 ఖర్చు చేసి మల్టిప్లెక్స్‌లో సినిమా చూడాలా? అని ఆలోచించే వారు సింగిల్ స్క్రీన్‌లో చూడవచ్చు' అంటూ చెప్పి సామాన్య, మధ్యతరగతి ప్రజలను అవమానించారు.
వక్రభాష్యం: సినిమా టికెట్ల ధరలు పెంచడంపై నిర్మాతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ధరలు పెంచడమే కాకుండా వాటికి వక్రభాష్యం పలకడం.. ప్రజల ఇష్టమని చెప్పడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
ఇండస్ట్రీకే ప్రమాదం: ఇష్టమొచ్చిన రీతిన ధరలు పెంచేసి ప్రజలు చూస్తే చూస్తారు లేకుంటే లేదు అంటే మాత్రం సినీ పరిశ్రమకే ఇబ్బంది అని కొందరు గుర్తు చేస్తున్నారు. సామాన్యుడికి అందుబాటులో లేని ఏ వస్తువు, సేవలు నిలబడలేవని గుర్తు చేస్తున్నారు.