Republic Day 2023: రిపబ్లిక్ డే స్పెషల్.. మన జాతీయ జెండాను ఎన్నిసార్లు మార్చారో తెలుసా..!
అప్పటి కలకత్తాలోని పార్సీ బగాన్ చౌక్ (గ్రీన్ పార్క్)లో ఆగస్టు 7, 1906న మొదటి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ జెండా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ క్షితిజ సమాంతర చారల నుంచి తయారు చేశారు. ఇది పైభాగంలో ఆకుపచ్చ, మధ్యలో పసుపు, దిగువన ఎరుపు రంగులో ఉంది. దీనితోపాటు తామర పువ్వులు, చంద్రుడు-సూర్యుడు బొమ్మలు కూడా ఇందులో ఉన్నాయి.
మరుసటి సంవత్సరం భారతదేశానికి కొత్త జాతీయ జెండా వచ్చింది. రెండవ జాతీయ జెండాను మేడమ్ కామా, ఆమెతో పాటు 1907లో బహిష్కరించబడిన కొంతమంది విప్లవకారులు పారిస్‌లో ఈ జెండాను ఎగురవేశారు. అయితే ఈ సంఘటన 1905లో జరిగిందని చాలా మంది అంటున్నారు. ఇది కూడా మొదటి జెండాను పోలి ఉండేది. ఈ జాతీయ జెండాలో చంద్ర నక్షత్రాలు మొదలైనవారు కూడా ఉన్నాయి. ఇందులో కుంకుమ, ఆకుపచ్చ, పసుపు అనే మూడు రంగులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఈ జెండాను బెర్లిన్‌లో ఒక సమావేశంలో కూడా ఎగురవేశారు.
1917లో మన స్వాతంత్ర్య పోరాటం ఒక నిర్దిష్టమైన మలుపు తీసుకున్నప్పుడు మూడో జెండా వచ్చింది. హోం రూల్ ఉద్యమంలో డాక్టర్ అనిబీసెంట్, లోకమాన్య తిలక్ ఈ జెండాను ఎగురవేశారు. ఈ జెండాలో 5 ఎరుపు, 4 ఆకుపచ్చ సమాంతర చారలు ఒకదాని తర్వాత ఒకటి.. సప్తరుషి దిశలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఎడమ ఎగువ అంచున (స్తంభం వైపు) యూనియన్ జాక్ ఉంది. ఒక మూలలో తెల్లటి చంద్రవంక, నక్షత్రం కూడా ఉన్నాయి.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పింగళి వెంకయ్య ఒక జెండాను తయారు చేసి గాంధీజీకి ఇచ్చాడు. ఈ కార్యక్రమం 1921లో బెజవాడ (ప్రస్తుతం విజయవాడ)లో జరిగింది. ఈ జెండాను రెండు రంగులతో తయారు చేశారు. ఎరుపు, ఆకుపచ్చ రంగు రెండు ప్రధాన కమ్యూనిటీలు అంటే హిందూ, ముస్లింలను సూచిస్తుంది. మిగిలిన సమాజానికి ప్రాతినిధ్యం వహించడానికి తెల్ల రంగు, దేశం పురోగతిని సూచించడానికి ఒక స్పిన్నింగ్ వీల్ ఉండాలని గాంధీజీ సూచించారు.
1921లో తయారు చేసిన ఈ జాతీయ జెండా 10 సంవత్సరాలు ఉనికిలో ఉంది. ఈ తరువాత 1931 కరాచీ కాంగ్రెస్ సమావేశంలో పై నుంచి కిందకు వరుసగా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో పట్టీలు.. మధ్యలో చరఖాతో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయజెండాను ఆమోదిస్తూ తుది తీర్మానం చేశారు.
ఆ తరువాత 1947లో దేశ స్వాతంత్య్రానికి ముందు చరఖా స్థానంలో అశోక ధర్మా చక్రాన్ని ఉంచి.. జాతీయా జెండాకు తుదిరూపునిచ్చారు. మన జాతీయ పతాకం పరిణామం ప్రస్తుత రూపానికి చేరుకోవడానికి అనేక దశలను దాటింది. మన జాతీయ జెండా అభివృద్ధిలో కూడా కొన్ని చారిత్రక మైలురాళ్లు వచ్చాయి.