Foods For Healthy Hair: మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలంటే ఈ 7 రకాల ఫుడ్స్ ఖచ్చితంగా డైట్లో చేర్చుకోవాలి
Foods For Healthy Hair: జుట్టు ఒత్తుగా, పొడుగ్గా, బలంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి, చెడు ఆహార అలవాట్ల కారణంగా జుట్టు రాలిపోవడం, చుండ్రు, చిన్న వయస్సులో తెల్ల వెంట్రుకలు రావడం, జుట్టు పొడిబారడం వంటి సమస్యలు ఎక్కువవుతుంటాయి. ఈ సమస్యలతో పోరడటానికి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు. హెయిర్ ఆయిల్, హెయిర్ మాస్క్ లు జుట్టును రక్షించడానికి సహాయపడతాయి. కానీ మనం తీసుకునే ఆహారం , జీవనశైలి కూడా ఆరోగ్యకరమైన జుట్టును అందిస్తాయి. మీ డైట్లో ఆహార పదార్థాలు చేర్చుకుంటే..జుట్టు పెరుగుదల వేగంగా ఉంటుంది. వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. మీ జుట్టు పెరుగుదలకు సహాయపడే ఆహార పదార్థాలు ఏవో చూద్దాం
నట్స్: పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, నువ్వుల గింజల్లో ఐరన్, జింక్, కాపర్ మెగ్నీషియం సెలీనియం, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాకుండా, జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.
దానిమ్మ: దానిమ్మలో విటమిన్ కె, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మలో ఐరన్ కంటెట్ ఎక్కువగా ఉండటంతోపాటు విటమిన్ సి కూడా ఉంటుంది. ఈ పండు జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలను కలిగి ఉన్నందున ఈ పండును తీసుకోవడం జుట్టు ఆరోగ్యానికి ఉత్తమమని వైద్యులు సలహా ఇస్తున్నారు.
కొబ్బరి : కొబ్బరిలో మాంగనీస్, ప్రొటీన్, పొటాషియం, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. దీని ఉపయోగం జుట్టుకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ఆహారాలలో ఉపయోగించవచ్చు. అలాగే మంచినీరు లేదా కొబ్బరి నూనె రూపంలో తినవచ్చు లేదా త్రాగవచ్చు. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తలకు ఉపయోగించవచ్చు
ఉసిరి: ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని వినియోగం ఆరోగ్యానికి చాలా అవసరం. జుట్టు పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది జుట్టును బలపరిచే, ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహించే ముఖ్యమైన ప్రోటీన్‌లను విచ్ఛిన్నం చేసే అవకాశాన్ని తగ్గిస్తుంది.
మునగాకు: మునగాకులో విటమిన్లు A, C, E లతో కూడిన అద్భుతమైన ఆహార పదార్థం. కాల్షియం పొటాషియం ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకుకూరలో యాంటీఆక్సిడెంట్లతోపాటు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. దీని వినియోగం రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, ఆరోగ్యకరమైన చర్మం, జుట్టును ప్రోత్సహిస్తుంది. దీన్ని ఎండబెట్టి పొడిగా తీసుకోవచ్చు.
కరివేపాకు: కరివేపాకు ఆకులు జుట్టు నెరసిపోవడాన్ని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన నల్లటి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, అమినో యాసిడ్స్, విటమిన్ బి వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ బి6 మెలనిన్ ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా జుట్టు సహజ రంగును ఇస్తుంది. ఈ ఆకులను నీళ్లతో మరిగించి, ఈ నీటిని టీ లేదా కరివేపాకులను కూరలు, సూప్‌లు, అన్నం వంటి వివిధ వంటకాల్లో చేర్చి తాగడం వల్ల జుట్టుకు అవసరమైన పోషకాలు లభిస్తాయి.
మెంతి గింజలలో ప్రొటీన్లు, ఎ, కె, సి వంటి విటమిన్లు, ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి మినరల్స్ అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. హెల్తీ హెయిర్ మెయింటెయిన్ చేయడానికి, జుట్టు రాలడాన్ని నివారించడానికి ఈ పోషకాలు ముఖ్యమైనవి. మెంతి గింజలలో ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. జుట్టు పల్చబడడాన్ని తగ్గిస్తుంది.