Tirumala news: తిరుమల వెంకటేశ్వర స్వామికే శఠగోపం.. వైసీపీ ఎమ్మెల్సీపై కేసు.. ఆయన ఏంచేశారో తెలుసా..?
తిరుమల శ్రీవారిని కలియుగంలో పిలిస్తే పలికే దైవంగా చాలా మంది భావిస్తారు. ప్రతిరోజు దూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామి దగ్గర తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు.
తిరుపతిలో స్వామి వారి దర్శనంగానీ, అన్నదానంలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సైతం.. ఎంతో వేడుకగా నిర్వహించారు. సామాన్య భక్తులే టార్గెట్ గా స్వామి వారి దర్శనం అయ్యేలా చేయాలని సీఎం చంద్రబాబు టీటీడీని ఆదేశించారు.
ఇధిలా ఉండగా.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లను అధిక ధరకు విక్రయించినట్టు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానంపై ఆరోపణలు వచ్చాయి. ఆరు టిక్కెట్లను రూ.65 వేలకు విక్రయించారని బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో రచ్చగా మారింది.
తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనం కోసం.. ఎమ్మెల్సీ ఖానం సిఫార్సు లేఖపై ఆరు టిక్కెట్లు పొందినట్టు భక్తుడు తెలిపాడు. ఇందుకోసం రూ.65 వేలు చెల్లించామని ఆరోపించాడు. అధిక ధరకు విక్రయించడంతో టీటీడీ విజిలెన్స్ విభాగానికి సాయికుమార్ అనే భక్తుడు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఆరోపణలు నిర్దారణ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో.. ఎమ్మెల్సీ జకియా ఖానం, ఆమె పీఆర్వో కృష్ణతేజ సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా ఎమ్మెల్సీ, ఏ3గా ఆమె పీఏలను చేర్చారు. కాగా, ఇటీవల కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ జకియా ఖానం అధికార పార్టీలోకి జంప్ అవుతారని వార్తలు జోరుగా వస్తున్నాయి. ఇటీవల నారా లోకేశ్‌ను కలవడంతో టీడీపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు, ఆదివారం ఆమె విజయవాడకు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటారనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. అయితే.. తిరుమల వీఐపీ టికెట్ల వివాదం గురించి తనకు తెలియదన్నారు. కొంత మంది వైసీపీ నేతలు దీనివెనుక కుట్రలు పన్నారని చెప్పుకొచ్చారు. ఆమె చంద్రబాబును కలిసేందుకు వెళ్తున్నారని ఇలాంటి కొత్త వివాదంకు వైసీపీ తెరదీశిందని కూడా ఆమె ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం రాజకీయాల్లో రచ్చగా మారింది.