Mahalaya Paksham: మహాలయ పక్షం అంటే ఏమిటి ? ఈ పితృ పక్షాల్లోనే ఎందుకు పిండ ప్రధానాలు చేస్తారు.. ?

Mon, 16 Sep 2024-8:33 am,

Mahalaya Paksham: మహాలయ పక్షం లేదా పితృ పక్షాలు.. కొన్ని ప్రాంతాల్లో ఈ పక్షం రోజులను పెత్తన అమాస అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పితృ పక్షాలు ఈనెల సెప్టెంబర్ 18 న ప్రారంభమై అక్టోబర్ 2 వ తేదీ మహాలయ అమావాస్యతో ముగుస్తాయి.  ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి , మీ పితృదేవతలను స్మరించుకోవడం వలన మనకు ఆయు:, ఆరోగ్యం, ఐశ్వర్యం సంప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

అందుకే  వారికి నమస్కారము చేస్తూ ,  నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి, మీ దీవెనలు అందచేయండి అని మన: పూర్వకంగా ప్రార్థన చేయడం వలన అనేక శుభ ఫలితాలను అందుకుంటారు. ఇంకా మహా లయ పక్షమున పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు ఈ పక్షం అత్యంత శ్రేష్ఠమైనదిగా వ్యవహరిస్తారు.

 

భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ముఖ్యంగా వినాయక పూజకలు ఎంత విశిష్టమైనదో.. బహుళ పక్షం పితృదేవతా ఆరాధనలకు అంతే  శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృ పక్షమని వ్యవహరిస్తారు. దాంతో మహాలయ పక్షమని పిలుస్తంటారు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతి రోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను తెలిసిన వాళ్లు శాస్త్రోస్తకంగా నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు కన్నుమూసారో  ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి. ఒకవేళ తిథి రోజు వీలు కాకపోతే.. అమావాస్య రోజున పిండ ప్రధనాలు చేయడం అత్యంత శ్రేయస్కరం.

తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో పితృ పక్షాల్లో నవమి నాడు తర్పణ , శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య రోజైన అక్టోబర్ 2 వ తేది నైనా చేసి తీరాలి.

దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి , దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం ! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది.

దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి , దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం ! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది.

ఆ చెట్టుకున్న పండ్లే కాదు , మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందర ఉంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.

స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ‘‘కర్ణా ! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం , వెండి , డబ్బు రూపేణా చేశావు గానీ , కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి.

కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరి విధాల ప్రాధేయపడగా , ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూప మైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి , మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు,బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ  చేశాడు. పితృ దేవతలకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు.

ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు , పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది.  ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి , తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు వచ్చింది. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.  కాబట్టి ప్రతి ఒక్కరు కులాలకు,మతాలకు అతీతంగా మీ కుటుంబంలో, స్నేహితుల్లో, గురువుల్లో మరణించిన మీ మీ పితృదేవతలకు తిల (నువ్వులు) శ్రాద్ధం కానీ అన్న శ్రాద్ధం కానీ సమర్పించి వారి అనుగ్రహం పొంది మీ వంశాభి వృద్ధికి వారి ఆశీస్సులు లభిస్తాయి.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link