Bumblebee Attack On Funeral Procession: ఇది ఒక విచిత్రమైన ఘటన.. అంతిమ యాత్రలో పాల్గొన్న జనం ఉన్నట్టుండి కందిరీగల గుంపు తమ మీద పడి దాడి చేయడంతో శవాన్ని కూడా అక్కడే వదిలేసి బతుకుజీవుడా అంటూ తలోవైపు పరుగులు తీసిన ఘటన ఇది. జార్ఖండ్ లోని గుమ్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. గుమ్లాలో నీరల్ కేర్‌కట్ట అనే వ్యక్తి చనిపోగా అతడి బంధుమిత్రులు, గ్రామస్తులు అతడిని చివరి చూపు చూసేందుకు వచ్చారు. అనంతరం అంతిమ యాత్ర ప్రారంభమైంది. శవం పాడె మోసే వారు, శవానికి తల కొరివి పెట్టే వారు తమ చేతుల్లో అగర్‌బత్తీలు ముట్టించుకుని వెళ్లటం అనేది ఒక ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక్కడ వీళ్లు కూడా శవానికి ఇరువైపులా అగర్‌బత్తీలు పట్టుకుని నడుస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతిమయాత్ర ఊరు దాటి స్మశానం వైపు వెళ్తోంది. ఇంతలోనే ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో కానీ ఉన్నట్టుండి కందిరీగల గుంపు వారిపైకే దూసుకొచ్చి దాడికి పాల్పడింది. అంతిమయాత్రలో పాల్గొన్న కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులపై దాడికి పాల్పడ్డాయి. ఊహించని ఈ హఠాత్పరిణామంతో ఖంగుతిన్న వాళ్లు అందరూ శవాన్ని అక్కడే వదిలేసి తలో దిక్కుకు పరుగులు తీశారు. అయినప్పటికీ కందిరీగలు వారిని విడిచిపెట్టలేదు. వెంటపడి వెంటపడి మరీ కరిచాయి. అంతిమయాత్రలో దాదాపు 50 కి పైగా జనం పాల్గొనగా.. 30 మందికిపైగా జనం కందిరీగల దాడిలో గాయాలపాలయ్యారు. 


గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో కొంతమంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిలో మృతుడు నీరల్ కేర్ కెట్ట కుటుంబసభ్యులు, పురోహితుడు కూడా ఉన్నారు. ఈ కందిరీగల దాడికి వారు తమ వెంట తీసుకెళ్లిన అగర్‌బత్తీల వాసనే కారణం అయ్యుంటుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


సాధారణంగా జనావాసాల్లో కందిరీగలు కానీ లేదా తేనెటీగలు కానీ గూడు పెడితే.. వాటిని అక్కడి నుంచి తరిమేయడం కోసం నిప్పు పెట్టి పొగపెడుతుంటారు. ఆ సమయంలో నిప్పు పెట్టే వారు కందిరీగలకు లేదా ఆ తేనెటీగలకు చిక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. లేదంటే అవి వారిపై దాడి చేసే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ శవ యాత్రలో పాల్దొన్న వారు కూడా అగర్‌బత్తీలు తీసుకెళ్లే క్రమంలో వాటి పొగ తగలడం వల్లే కందిరీగలు ఇలా దాడికి పాల్పడి ఉంటాయని గ్రామస్తులు చెబుతున్నారు.