Dating, Live-in Relationship: ఇక్కడ డేటింగ్, సహ జీవనం చేసిన తరువాతే పెళ్లి
Dating, Live-in Relationship: పెళ్లికి ముందు సమాజం అంగీకరించని పని ఏం చేసినా అది పెద్ద తప్పే అవుతుంది అని అనుకునే సమాజం మనది. కానీ పెళ్లికి ముందే అన్నీ అర్థం చేసుకోవాలి అని అనుకునే సమాజం కూడా ఒకటుంది. అదెక్కడో ఆఫ్రికాలోనో లేక మరో దేశంలోనో కాదు.. మన దేశంలోనే.. మన మధ్యే ఉంది. ఆ డీటేల్స్ ఏంటో తెలుసుకుందాం రండి.
Dating, Live-in Relationship: పెళ్లికి ముందు తమ పిల్లలు ఎవరైనా బయట మరెవరివతోనైనా చెడు తిరుగుళ్లు తిరుగుతున్నారని తెలిస్తే తాట తీసే సమాజం మనది. భవిష్యత్ బాగుండాలి.. కుటుంబానికి మచ్చ తీసుకురాకుండా ఉండాలి, కుటుంబం పరువు ప్రతిష్టలు పెంచాలి కానీ తుంచొద్దు.. పరువు తీయకుండా పద్ధతిగా ఉండాలి.. అనుకువగా ఉండాలి.. ఇంట్లో దించిన తల మళ్లీ ఇంట్లోనే ఎత్తాలి.. బయటి వారితో.. ప్రత్యేకించి ముక్కూ మొహం తెలియని వారితో అసలే మాట్లాడొద్దు.. పరిచయం పెంచుకోవద్దు.. ఇలా మన సమాజంలో పెద్దల నుంచి వినిపించే మాటలు. అలా ఉండటంలో అసలు తప్పే లేదు. పద్ధతి కలిగిన కుటుంబాల్లో కనిపించే సంప్రదాయమే ఇది. అయితే, ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.
పద్ధతి లేదు.. పాత చింతకాయ పచ్చడి లేదు అనే వాళ్లు కూడా లేకపోలేదు. మారుతున్న రోజులను బట్టి మెట్రో నగరాల్లో, అమ్మానాన్నలకు ఇంటికి దూరంగా ఉండే వాళ్లు లేదా పబ్బులు, క్లబ్బులు, ఫామ్ హౌజ్ పార్టీలు అంటూ కాస్మోపాలిటన్ కల్చర్‌కి అలవాటు పడిన వాళ్ల లైఫ్ స్టైల్ కొంచెం వేరుగా ఉంటుండటం కూడా చూస్తూనే ఉన్నాం. పెళ్లికి ముందు డేటింగ్ చేయడం, సహ జీవనం చేయడం.. చట్టాపట్టాలేసుకుని తిరగడం.. ఆ తరువాత తమ ఇద్దరి మధ్య ఎలాంటి అభిప్రాయబేధాలు లేకపోతే.. ఇద్దరికీ నచ్చితేనే పెళ్లి చేసుకుని సెటిల్ అవడం ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. అయితే ఇదంతా కాస్మోపాలిటన్ కల్చర్ కే పరిమితం అయింది కానీ పల్లెల్లోకి, మధ్య తరగతి, దిగువ తరగతి బతుకుల్లోకి ఇంకా అంతగా పాకలేదనే చెప్పుకోవాలి.
కానీ మీలో చాలామందికి తెలియని మరొక విషయం ఏంటంటే.. ఈ పబ్బులు, గబ్బులు అనేవి ఏవీ తెలియకుండానే.. అసలు కాస్మోపాలిటన్ కల్చర్ అనే పేరు కూడా వినకుండానే.. పెళ్లికి ముందే డేటింగ్, సహ జీవనం చేస్తే కానీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అనే నిబంధన పెట్టుకున్న సమాజం కూడా ఒకటి ఉంది అని చెబితే నమ్ముతారా ??.
అవును, వినడానికి కొంచెం విచిత్రంగానే ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికీ నిజం. సుత్తి లేకుండా సూటిగా పాయింట్ కి వద్దాం. చత్తీస్ ఘడ్ లోని బస్తర్ పేరు చెబితే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది నక్సల్స్. ఎందుకంటే అక్కడ నక్సల్స్ ప్రాభల్యం ఎక్కువ. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో అక్కడక్కడా మురియ అనే గిరిజన తెగలు నివసిస్తున్నాయి. బస్తర్ లోనే కాకుండా చత్తీస్ ఘడ్ లోని అడవుల్లో అక్కడక్కడా ఈ గిరిజన తెగ ప్రజలు నివసిస్తున్నారు. వీళ్లు ఎక్కడున్నా.. అంతా ఒక సమూహంలా ఏర్పడి, అడవుల్లోనే ఒక గూడెం మాదిరిగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తుంటారు.
ఈ సంప్రదాయం ఎందుకంటే..
మురియా తెగ జీవన విధానం వేరు. వారు పెట్టుకున్న స్వీయ నిబంధనల ప్రకారం పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి డేటింగ్ చేసుకోవాలి. సహజీవనం చేయాలి. ఈ రూల్ ఆప్షనల్ కాదండోయ్.. మ్యాండేటరీ. అవును.. డేటింగ్, లివ్-ఇన్ రిలేషన్ షిప్ లేకుండా ఇక్కడ పెళ్లికి అనుమతించరు. డేటింగ్, లివ్-ఇన్ రిలేషన్ షిప్ పూర్తయ్యాకే వారికి పెళ్లి చేస్తారు. అప్పటి వరకు మరి సమాజం ఏమనుకుంటుంది తొక్కా, తోట కూర వంటి డైలాగ్స్ మీ మెదడును తొలిచేస్తున్నాయి కదా.. ఇక్కడ అలాంటిదేం లేదు. పైగా ఇరుకుటుంబాలతో పాటు సమాజం కూడా వారికి సహాయం చేస్తుంది. ఎందుకంటే ఈ సంప్రదాయం వారికి అనాదిగా వస్తోన్న ఆచారం. ఆ ఆచారాన్ని వారు గౌరవిస్తారు. పైగా అక్కడ నివాసం ఉండేది అంతా అదే తెగకు చెందిన వారు కావడంతో ఈ సంప్రదాయంతో అక్కడి వారికి వచ్చిన ఇబ్బంది కూడా లేదు. పెళ్లి చేసుకుబోయే వారు ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకుని, ఏ ఇబ్బందులు లేకుండా జీవితం గడిపేందుకే వారు ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారట.
పేర్లు కూడా ఉన్నాయి..
ఇలా డేటింగ్ లో ఉన్న అబ్బాయిని చెలిక్ అని అంటారు. అలాగే అమ్మాయిని మొతియారి అని పిలుస్తారు. వీళ్లు డేటింగ్ చేసుకోవడం కోసం, వీరి సహ జీవనం కోసం తాత్కాలికంగా వారి ఇంటి ఆవరణలోనే ఒక తాత్కాలిక గృహం కూడా నిర్మిస్తారు. ఈ గృహాన్నే ఘోతుల్ అని పిలుస్తారు. ఈ తాత్కాలిక ఇంటిని అడవిలో లభించే వెదురు బొంగులు, బంక మన్నుతో నిర్మిస్తారు.
ఇంతకీ ఎవరు, ఎవరిని ఫాలో అవుతున్నట్టబ్బా ???
ఊరికి దూరంగా విసిరేసినట్టుండే కారడవుల్లో ఉండే కొయ్య జాతి తెగ వారు అనాదిగా ఈ ఆచారాన్ని అనుసరిస్తున్నారంటే విచిత్రంగా ఉంది కదా. అడ్వాన్స్ లైఫ్ అనుభవిస్తున్నాం అనుకుంటున్న కాస్మోపాలిటన్ వాళ్ల కల్చర్ ని వీళ్లు ఫాలో అవుతున్నారా అంటే అసలు వీరికి ఆ ప్రపంచంతో సంబంధమే లేదు. మరి అలాంటప్పుడు అడవుల్లో ఉన్న ఈ కొయ్య జాతి కల్చర్‌నే అడ్వాన్స్ లైఫ్ అనుభవిస్తున్న వారు ఫాలో అవుతున్నారా అనే సందేహాలు కూడా రాకమానవు.