King Cobra Hides Inside Car: పాములంటే చాలామందికి చచ్చేంత భయం. సడెన్‌గా ఎక్కడైనా పాము కనిపించిందంటే పై ప్రాణాలు పైనే పోయినట్లనిపిస్తుంది. ఇటీవల కేరళకి చెందిన ఓ కారు యజమానిని ఓ కింగ్ కోబ్రా వారం రోజులకు పైగా టెన్షన్ పెట్టింది. పాము కారులోకి దూరడం చూసిన అతను.. దాన్ని బయటకు రప్పించేందుకు నానా ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. చివరకు ఇక అది వెళ్లిపోయి ఉంటుందిలే అని టెన్షన్ ఫ్రీగా ఉన్న సమయంలో.. హఠాత్తుగా దాని కుబుసం కనిపించింది. దీంతో స్నేక్ రెస్క్యూ టీమ్‌ను పిలిపించినప్పటికీ కారులో ఎక్కడా అది కనిపించలేదు. కొద్దిరోజులకు హఠాత్తుగా ఆ పాము పొరుగింటి సమీపంలో ప్రత్యక్షమైంది...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కొట్టాయం జిల్లా అర్పూకరా గ్రామానికి చెందిన సుజిత్‌కు టాటా నెక్సాన్ కారు ఉంది. ఇటీవల ఈ కారులో సుజిత్ అర్పూకరాకి 240కి.మీ దూరంలో ఉన్న నీలాంబుర్ ప్రాంతానికి వెళ్లాడు. నీలాంబూర్‌లో ఒకచోట కారును పార్క్ చేసిన సమయంలో.. అందులోకి పాము దూరడం గమనించాడు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చాడు. అటవీ సిబ్బంది వచ్చి కారులో పాము కోసం వెతకగా అది ఇంజిన్ భాగంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి దాన్ని బయటకు లాగే క్రమంలో అది బ్యాటరీ కిందకు వెళ్లి దాక్కుంది.


ఇక దాన్ని బయటకు తీయడం సాధ్యం కాకపోవడంతో.. కారు యథావిధిగా డ్రైవ్ చేస్తూ వెళ్లిపోవాలని, ఇంజిన్ వేడికి పాము ఆటోమేటిగ్గా బయటకు వెళ్లిపోతుందని అటవీ సిబ్బంది సుజిత్‌తో చెప్పారు. అయితే అటవీ సిబ్బంది చెప్పినట్లుగా జరగలేదు. దీంతో కొద్దిరోజులు కారును ఎటూ తీయకుండా పార్క్ చేసి ఉంచాడు. అయినప్పటికీ లాభం లేకపోయింది. పాము ఎంతకీ బయటకు రాకపోవడంతో సుజిత్ కారును సర్వీస్ స్టేషన్‌కి తీసుకెళ్లాడు. అక్కడ కారును డీజిల్ వాష్ చేయించాడు. అయినా పాము బయటకు రాలేదు. దీంతో అతనికేమీ అర్థం కాలేదు.


పాము ఉందా లేదా అనే కన్ఫ్యూజన్‌లోనే నీలాంబూర్ నుంచి తన స్వగ్రామం అర్పూకరాకి వచ్చేశాడు. ప్రతీసారి కారు బయటకు తీసేముందు అంతా చెక్ చేసేవాడు. ఎక్కడా పాము కనిపించేది కాదు. చివరకు ఓరోజు హఠాత్తుగా కారు కింది భాగంలో పాము కుబుసం వేలాడుతూ కనిపించింది. దీంతో వెంటనే రెస్క్యూ టీమ్‌ను పిలిపించాడు. రెస్క్యూ టీమ్ బంపర్ పార్ట్ ఊడదీసి చెక్ చేశారు. అయినా పాము కనిపించలేదు. 


ఇది జరిగిన కొద్దిరోజులకు సుజిత్ ఇంటి సమీపంలో ఓ కింగ్ కోబ్రా కనిపించింది. సాధారణంగా ఆ ప్రాంతంలో అలాంటి కింగ్ కోబ్రా ఎప్పుడూ కనిపించలేదు. అప్పటికే సుజిత్ కారులో కింగ్ కోబ్రా ఉందనే విషయం అక్కడివారికి తెలిసిపోయింది. వెంటనే సుజిత్‌కు సమాచారమివ్వగా అతను ఆ ఇంటి వద్దకు వెళ్లి ఆ కింగ్ కోబ్రాను చూశాడు. అవును.. అది తన కారులోకి దూరిన పామేనని చెప్పాడు. ఎట్టకేలకు అది కారు నుంచి బయటకు రావడంతో వారం రోజులకు పైగా అతను పడ్డ టెన్షన్ అంత మాయమైపోయింది. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారమివ్వడంతో.. సిబ్బంది వచ్చి ఆ పామును పట్టుకుని తీసుకెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. 


Also Read: LPG Cylinder Price: ఎల్‌పీజీ కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్... భారీగా తగ్గిన ధర...  


Also Read: Fourth Wave Scare: దేశంలో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు...మెుత్తం కేసులన్నంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook