అమీర్ వల్లే నా ట్విటర్ ఖాతా బ్లాక్..!
వివాదాస్పద బాలీవుడ్ చిత్ర సమీక్షకుడు, నటుడు కేఆర్‌కే (కమల్ ఆర్ ఖాన్) ట్విటర్ ఖాతాకు సస్పెన్షన్ వేటు పడింది. ప్రముఖులపై అసభ్యపదజాలం ఉపయోగిస్తూ ట్వీట్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో ట్విటర్ నిర్వాహకులు కేఆర్‌కే ఖాతాను తొలిగించారు. అయితే, తన ట్విటర్ ఖాతా సస్పెన్షన్ వెనుక బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ హస్తం ఉందంటున్నాడు కేఆర్‌కే.
అమీర్ నటించిన తాజా చిత్రం "సీక్రెట్ సూపర్ స్టార్" బాగాలేదని తను ట్విటర్‌లో పేర్కొన్నందుకే అమీర్ తన ఖాతాను సస్పెండ్ చేయించాడని కేఆర్‌కే వాపోతున్నాడు. ఈ విషయం మీద తాను హైకోర్టుకి వెళ్తానని కూడా పేర్కొన్నాడు. తాను నాలుగు సంవత్సరాలు కష్టపడి ట్విటర్ ద్వారా ఆరు మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నానని.. అందుచేత ట్విటర్ నిర్వహకులు ఇప్పుడు సస్పెన్షన్ అంటే ఊరుకొనేది లేదని.. వారు తనకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తెలిపాడు.
ఈ క్రమంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు కేఆర్‌కే. అజయ్ దేవగన్ నటించిన "శివాయ్" చిత్రం గురించి ట్విటర్‌లో నెగటివ్ టాక్ ప్రచారం చేయమని కరణ్ జోహార్ తనకు 20 లక్షలు ఇచ్చాడని తెలిపాడు. గతంలో కూడా కేఆర్‌కే బాహుబలి 2 చిత్రంపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు.