Man Dragged on Car Bonnet: కారు బానెట్‌పై 3 కిమీ లాక్కెళ్లాడు.. వీడియో వైరల్
Man Dragged on Car Bonnet: బాధితుడు కారు ఆపాల్సిందిగా ఎంత మొత్తుకున్నప్పటికీ.. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కారును ఆపకుండా వెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు. అయితే, ఇదే దృశ్యాన్ని చూసిన పోలీసులు సైతం ఆ కారును వెంబడించారు.
Man Dragged on Car Bonnet: తాగిన మైకంలో కారు నడుపుతున్న ఓ వ్యక్తి.. తన ఎదురుగా వెళ్తున్న కారును ఢీకొట్టడమే కాకుండా.. ఇదేంటని ప్రశ్నించినందుకు అతడిని తన కారు బానెట్‌పై వేసుకుని 2 నుంచి 3 కిలో మీటర్ల దూరం లాక్కెళ్లాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దేశ రాజధాని ఢిల్లీ నొయిడా శివార్లలోని ఆశ్రమ్ చౌక్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆశ్రమ్ చౌక్ నుంచి నిజాముద్దీన్ దర్గా మార్గంలో వెళ్తున్న కారుపై ఓ వ్యక్తి వేళ్లాడుతుండటం చూసి ప్రత్యక్షసాక్షులు షాకయ్యారు.
బాధితుడు కారు ఆపాల్సిందిగా ఎంత మొత్తుకున్నప్పటికీ.. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కారును ఆపకుండా వెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు. అయితే, ఇదే దృశ్యాన్ని చూసిన పోలీసులు సైతం ఆ కారును వెంబడించారు. ఈ కేసులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఒక వ్యక్తిని కారు బానెట్ పై ఈడ్చుకెళ్లిన ఘటనలో రాంచంద్ కుమార్ అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి అతడిపై కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై బాధితుడు స్పందిస్తూ తనకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని పోలీసులకు వెల్లడించాడు. తాను ఒక కారు డ్రైవర్ నని.. కస్టమర్ ని డ్రాప్ చేసి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని అన్నాడు. ఈ కారులో ఉన్న వ్యక్తి తన కారుతో మూడుసార్లు నా కారును ఢీకొట్టాడు. ఇదేంటని ఆపి ఆ కారు ఎదురుగా నిలబడి ప్రశ్నిస్తుండగానే కారును స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. తనకు తప్పించుకునే వ్యవధి కూడా లేకపోవడంతో బానెట్ పట్టుకుని వేళ్లాడసాగాను. కారు ఆపమని ఎంత బతిమిలాడినా నా మాట వినిపించుకోలేదు. కారును వేగంగా నడిపిస్తూ ఇక్కడి వరకు ఈడ్చుకొచ్చాడు. దారిలో పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద పోలీసులు నిలబడటం చూశాను. పోలీసులే ఆ దృశ్యం చూసి వెనకాలే ఫాలో అవుతూ వచ్చారని బాధితుడు చెప్పుకొచ్చాడు.
ఇదిలావుంటే, ఈ ఘటనలో నేరానికి పాల్పడిన రాంచంద్ కుమార్ మరో వెర్షన్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యక్తే కావాలని తనే నా కారు బానెట్‌పైకి దూకాడని.. అతడు ఆరోపిస్తున్నట్టుగా తానేమీ అతడి కారును తాకలేదని చెప్పుకొచ్చాడు. కారు దిగిపోవాల్సిందిగా ఎంత చెప్పినా అతడు వినిపించుకోలేదు అంటూ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఏదేమైనా కారుని నిర్లక్ష్యంగా నడిపి ఒకరి ప్రాణాలకు హాని కలిగేలా వ్యవహరించిన నేరం కింద రాంచంద్ కుమార్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.