కాశ్మీర్‌లో లేహ్ సరస్సు ఎంత అందమైనదో మనకు తెలియంది కాదు. అటువంటి సరస్సు కాలుష్యం కోరల్లో చిక్కుకుందని.. దానిని శుభ్రం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని చెబుతోంది ఓ కాశ్మీరీ చిన్నారి. అయితే ఆమె ఆలోచన మాటలతోనే ఆగిపోలేదు. చేతలకూ దారి తీసింది. ప్రతీ రోజు తన తండ్రితో కలిసి లేహ్ సరస్సును శుభ్రం చేయడమే పనిగా పెట్టుకుందామె. చిన్న పడవలో ప్రయాణిస్తూ.. సరస్సులోని చెత్తను తన తండ్రి సహాయంతో తొలిగించడానికి శ్రీకారం చుట్టిందామె. ఆమె చేస్తున్న పనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  ఆ వీడియో వైరల్ అయ్యి ఆఖరికి ప్రధాని నరేంద్ర మోదీ వరకూ చేరింది. ఆ వీడియోను మోదీ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఆ చిన్నారి చేస్తున్న పనిని ఎంతగానో మెచ్చుకున్నారు. ఆమెను అభినందిస్తూ ట్వీట్ కూడా చేశారు.