నోకియా నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్స్.. సరికొత్త ఫీచర్స్ !
ఒకప్పుడు మొబైల్ మార్కెట్‌లో రారాజుగా వున్న నోకియా ఆ తర్వాత సామ్సంగ్, జియోని లాంటి మొబైల్స్ రాకతో బాగా వెనకబడిపోయింది.
ఒకప్పుడు మొబైల్ మార్కెట్‌లో రారాజుగా వున్న నోకియా ఆ తర్వాత సామ్సంగ్, జియోని లాంటి మొబైల్స్ రాకతో బాగా వెనకబడిపోయింది. అయితే మళ్లీ పూర్వవైభవం కోసం పాటుపడుతున్న నోకియా ఈసారి హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థతో కలిసి సంయుక్తంగా రూపొందిస్తోన్న స్మార్ట్‌ఫోన్స్ శ్రేణిలో మరో ఐదు కొత్త మోడల్స్ తాజాగా మార్కెట్‌లోకొచ్చాయి. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018 (ఎండబ్ల్యూసీ)లో నోకియా 8 సిరొక్కో, నోకియా 7 ప్లస్, నోకియా 6 (కొత్త వేరియంట్), నోకియా 1, కొత్త ఫీచర్లతో కూడిన నోకియా 8110 మోడళ్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. నోకియా 8 సిరొక్కో స్మార్ట్‌ఫోన్ ధర రూ. 749 యూరోలు ( భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.60వేలు) గా కంపెనీ నిర్ణయించింది. ఏప్రిల్ నెలలో నోకియా 8 సిరొక్కో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ ప్రకటించింది.
నోకియా 8 సిరొక్కో ఫీచర్స్ :
5.5 అంగుళాల క్యూహెచ్‌డీ పీఓలెడ్ డిస్‌ప్లే
3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5
ఆక్టా-కోర్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ఎస్‌ఓసీ ప్రాసెసర్
6జీబీ ర్యామ్
128జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్
12 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
కొత్తగా మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్న నోకియా 6 ఇప్పటికే మార్కెట్‌లో వున్న పాత నోకియా 6 మోడల్ కన్నా 60 శాతం వేగంగా పనిచేసే సామర్థ్యం కలిగి వుంటుంది. ఈ ఫోన్ ధర 279 యూరోలు.
నోకియా విడుదల చేసిన మరో ఐకానిక్ మోడల్ 8110. మే నెల నుంచి మార్కెట్‌లో అందుబాటులో వుండనున్న ఈ మోడల్ స్మార్ట్ ఫోన్ ధర 79 యూరోలు. ప్రస్తుతం 4జీ కనెక్టివిటీ కలిగి వున్న ఈ మోడల్‌కి గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ సెర్చ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి యాప్స్ జతచేస్తూ దీనిని ఆవిష్కరించింది.