Snake In Mid-Day Meal: మధ్యాహ్న భోజనంలో పాము.. ఆస్పత్రిపాలైన స్కూల్ పిల్లలు
Snake Found In Mid-Day Meal: పాట్నా: పాము పడిన మధ్యాహ్నం భోజనం తిన్న పలువురు విద్యార్థులు అస్వస్థతపాలై ఆస్పత్రిలో చేరిన ఘటన ఇది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న గ్రామస్తులు భారీ సంఖ్యలో పాఠశాలకు, ఆస్పత్రి వద్దకు చేరుకుని, స్కూల్ సిబ్బందికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కోపోద్రిక్తులైన గ్రామస్తులు కొంతమంది స్కూల్ హెడ్ మాస్టర్ పై సైతం దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
Snake Found In Mid-Day Meal: పాట్నా: పాము పడిన మధ్యాహ్నం భోజనం తిన్న పలువురు విద్యార్థులు అస్వస్థతపాలై ఆస్పత్రిలో చేరిన ఘటన ఇది. బీహార్ లోని అరారియా జిల్లాలోని ఫోర్బ్స్‌గంజ్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో వారిని ఫోర్బ్స్‌గంజ్‌లోని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అసలు ఏమైందంటే..
మధ్యాహ్న భోజనం సమయంలో కిచిడి వడ్డించారు. పిల్లలు భోజనం చేసే సమయంలోనే ఒక విద్యార్థి ప్లేటులో బాగా ఉడికి చనిపోయిన పాము పిల్ల కనిపించింది. విద్యార్థి ఫిర్యాదుతో ఆ స్కూల్లో మధ్యాహ్న భోజనం వడ్డించడం ఆపేశారు. కానీ అప్పటికే చాలా మంది పిల్లలు ఆహారం తిన్నారు. ఆహారం తిన్న విద్యార్థులకు వాంతులు చేసుకోవడం మొదలవడంతో వెంటనే అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది.. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఫోర్బ్స్‌గంజ్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాము పడిన భోజనం తిన్న విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారనే వార్త స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన గురించి తెలుసుకుని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికుల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
మిడ్ డే మీల్స్‌లో పాము పడి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారనే ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్‌డిఎం, ఎస్‌డిఓ, డిఎస్పీ సహా ఉన్నతాధికారులు అందరూ ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల పరిస్థితి గురించి ఆరా తీశారు. వారికి అందుతున్న వైద్య సహాయం గురించి ఆస్పత్రి సూపరింటెండెంట్ ని అడిగి తెలుసుకున్న అధికారులు.. ఈ ఘటనపై విచారణ చేపట్టి పూర్తి నివేదిక అందించాల్సిందిగా సంబంధిత విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఘటనపై విచారణ చేపట్టి ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్డీఓ సురేంద్ర అల్బేలా తెలిపారు.
దాదాపు 100 మందికిపైగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నప్పటికీ... 25 మంది పిల్లలే అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్టు ప్రభుత్వ అధికారులు మీడియాకు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న గ్రామస్తులు భారీ సంఖ్యలో పాఠశాలకు, ఆస్పత్రి వద్దకు చేరుకుని, స్కూల్ సిబ్బందికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కోపోద్రిక్తులైన గ్రామస్తులు కొంతమంది స్కూల్ హెడ్ మాస్టర్ పై సైతం దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
మధ్యాహ్న భోజనంలో పాము రావడం ఇదేం మొదటిసారి కాదు..
మధ్యాహ్న భోజనంలో ఇలా పాము రావడం ఇదేం మొదటిసారి కాదు.. గతంలో ఇదే బీహార్‌లోని సీతామరి జిల్లాలోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో పాము పడిన మధ్యాహ్న భోజనం తిని 54 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఇలా పాములు, బల్లులు, పురుగులు పడిన భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నప్పటికీ.. పాఠశాలల సిబ్బంది వైఖరిలో మార్పు లేకుండా అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం ఆందోళనకు గురిచేస్తోంది అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.