న్యూ ఇయర్ ట్రాఫిక్ తాకిడికి గిలగిల కొట్టుకున్న వాట్సాప్!
ప్రపంచవ్యాప్తంగా వున్న వాట్సావ్ యూజర్లు ఒకేసారి వాట్సాప్‌ని వినియోగించడంతో యాప్‌లో అనుకోని సాంకేతిక లోపం తలెత్తింది.
డిసెంబర్ 31న రాత్రి వేళ నూతన సంవత్సరం సంబరాల్లో భాగంగా ఒక ప్రాంతంలోని జనం అక్కడి రోడ్లపైకి వస్తేనే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా!! మరి ప్రపంచవ్యాప్తంగా వున్న నెటిజెన్స్ ఏక కాలంలో ఒక యాప్‌ని కానీ లేదా ఒక వెబ్‌సైట్‌ని కానీ వినియోగిస్తే, ఆన్‌లైన్‌లో అక్కడ సాంకేతికంగా ఇంకెంత ట్రాఫిక్ జామ్ అవుతుందో ఊహించండి!! అవును, నిన్న రాత్రి కొత్త సంవత్సరం ప్రవేశించే వేళ ప్రముఖ మెస్సేజింగ్ సర్వీస్ యాప్ వాట్సాప్ విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. ఫేస్‌బుక్‌కి చెందిన వాట్సాప్ నిన్న రాత్రి ప్రపంచవ్యాప్తంగా కొంతసేపు పనిచేయడం మానేసింది. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల సంఖ్యలో యూజర్లు కలిగివున్న వాట్సాప్ ఒకేసారి అంతమందికి సేవలు అందించలేకపోవడంతో వాట్సాప్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
తమ స్నేహితులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, వినియోగదారులకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా వున్న వాట్సావ్ యూజర్లు ఒకేసారి వాట్సాప్‌ని వినియోగించడంతో యాప్‌లో అనుకోని సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో దాదాపు అర్ధగంట నుంచి గంటకుపైగా పనిచేయడం మానేసింది.
భారత్‌లోనూ పరిస్థితి అందుకు భిన్నం ఏమీ కాదు. సరిగ్గా రాత్రి 12 గంటల తర్వాత భారత్‌లోనూ వాట్సాప్ దాదాపు గంటసేపు పనిచేయలేదు. భారత్‌లో దాదాపు 200 మిలియన్లకిపైగా యూజర్లు వాట్సాప్‌ని వినియోగిస్తుండటమే ఈ ఆన్‌లైన్ ట్రాఫిక్‌కి ఓ కారణం అని సమాచారం.