Ugadi Pooja 2024 in Telugu: ఉగాది పర్వ దినం రోజున చేయాల్సిన పూజా విధానం.. క్రోధి నామ సంవత్సరం రోజున ఇలా చేస్తే మీ కష్టాలు పరార్..
Ugadi Pooja 2024 Krodhi: సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా అందరు ప్రజలు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అనుసరిస్తారు. కానీ తెలుగు ప్రజలు సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో హిందువులకు ఉగాది నుంచి కొత్త యేడాది ప్రారంభం అవుతోంది. ఈ రోజున ఎలాంటి పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి. పండితులు ఏం చెబుతున్నారంటే..
Ugadi Pooja 2024 - Krodhi: ఉగాది.. తెలుగు సహా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైనది. ఈ రోజు నుంచే తెలుగు సంవత్సరాది మొదలవుతుంది. ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత శ్రేయస్కరం. పండుగలకు ఆది పండుగ ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమినాడు జరుపుకునే ఈ పండుగ నుండే వసంత ఋతువు మొదలవుతుంది. కొత్త జీవితానికి శుభారంభం పలుకుతుంది. తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే అసలు సిసలు పండుగ ఉగాది. ఈ సారి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 9న ఉగాది పర్వదినం వచ్చింది. ఉగాది పండగను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో ఉగాదిగా పిలుస్తారు. మరికొన్ని చోట్లు యుగానికి ఆరంభ దినం కాబట్టి యుగాది అని కూడా పిలుస్తారు. ఇక తెలంగాణ పక్కనే ఉన్న మహారాష్ట్రతో పాటు డయ్యూ డామన్‌లలో గుడి పడ్వా అని పిలుస్తారు.
సంప్రదాయాలు, ఆచారాలు పాటు ఆరోగ్య రహస్యాలు, మానవ జీవిన విలువలు మేళవించిన అద్భుతమైన పండగ. తెలుగువారికి ఇష్టమైన పండుగ ఉగాది. కోయిల పాటే ఉగాది. చెట్ల చిగురించే కాలమే ఉగాది. షడ్రుచుల సమ్మేళనపు జీవితపు పరిమళమే ఉగాది. వసంత ఋతువు ఆగమన వేళ జరుపుకునే తొలి ఉత్సవం ఉగాది. తెలుగు వారి ఆత్మీయబంధానికి ప్రతీక. శిశిరంలో ఆకురాల్చిన ప్రకృతి.. వసంతంలోకి లేత ఆకుపచ్చగా.. కొత్త చిగుళ్లు వేసి నవ యవ్వనంలా కనిపిస్తుంది. కొత్త పూల నుంచి వీచే పిల్ల గాలికి పక్షులు కిలకిలరావాలతో గిలిగింతలు పెడతాయి. ఓటమివెంటే గెలుపు ఉంటుందని... చీకటివెంటే వెలుగు ఉంటుందని...నమ్మకాన్ని వీడద్దని చెప్పే పండుగ ఉగాది.
ప్రకృతి మొత్తం లే చివుళ్లతో, రంగురంగుల పూలతో ముస్తాబై ఆహ్వానం పలికే పండుగ ఉగాది. మత్త కోయిలల కుహూగానాలతో ఉగాదికి కొత్త సోయగాలు తీసుకువస్తాయి. ఉగ అంటే నక్షత్ర గమనం. ఈ నక్షత్ర గమనానికి ఆది ఉగాది. సృష్టి ఆరంభమైన రోజే ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమి రోజునే బ్రహ్మ సృష్టి ఆరంభించాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు మత్యావతారంలో సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన రోజునుండే ఉగాది పండగ జరుపుకోవడం ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి.
శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదే. ఈ రోజు నుండే శాలివాహన శకం ప్రారంభమైందని చెబుతారు. ఉగాదిలోని యుగం అంటే ద్వయం, జంట అని కూడా అర్థం ఉంది. ఉత్తరాయన, దక్షిణాయన అను ద్వయాలు కలిస్తేనే యుగం.. సంవత్సరం అవుతుంది. దీనికి ఆది యుగాది. హైందవశాస్త్రం ప్రకారం తెలుగు నామ సంవత్సరాలు అరవై. అవి ప్రతియేడు ఒక క్రమంలో వస్తాయి. ఈసారి వచ్చే క్రోధి నామ సంవత్సరం 38వది.
ఉగాది పండగ శోభ రెండు మూడు రోజుల నుంచే ప్రారంభమవుతోంది. ఉత్తరాదిన వసంత నవరాత్రలని అమ్మవారిని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం ఆనవాయితీ వస్తోంది. ఈ నవరాత్రుల్లో చివరి రోజైన నవమి నాడు.. శ్రీరామనవమితో వసంత నవరాత్రులు ముగుస్తాయి. ఉగాది పండగ రోజున ఇంటిని శుభ్రంగా కడుక్కొని పండుగ రోజున మామిడి ఆకులు, పూలతో తోరణాలు కట్టాలి. ఇంటి ముందు రంగు రంగుల రంగవళ్లుల్ల గీయాలి. ఉదయమే స్నానం, సంధ్యానుష్ఠానం నిర్వర్తించుకొని.. ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపు జల్లాలి. అంతేకాదు ఒంటికి నూనెతో అభ్యంగన స్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించాలి. ఉగాది సూర్యుడికి సంబంధించిన కాల పండగ. కాబట్టి సూర్యుడికి ప్రత్యేక నివేదాలు చేయాలి.
స్నానం అనంతరం మన ఇంట్లో తరాతరాలుగా ఏదైతే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామే అది చేయాలి. మన ఇంటి ఇలవేల్పును ప్రత్యేకంగా పూజించాలి. ఉగాది రోజున ఇంట్లో చేసిన షడ్రుచుల ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. జీవితంలో కేవలం తీపి మాత్రమే కాదు.. పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పు అనే ఆరు రుచుల ఉన్నట్టే జీవితంలో సుఖదుఃఖాలు ఒకదాని వెంట ఆనందంగా స్వీకరించాలని ఉగాది పచ్చడి మనకు బోధిస్తోంది.
భక్తులు ఉగాది సందర్భంగా భక్తులు, ఆయురాగోగ్యాలు, సుఖ సంతోషాలు, సౌభాగ్యం, కలగాలిని విజయం కోసం భగవంతుని ఆశీస్సులు పొందాలి. కొత్త వ్యాపారానికి ఇంకా ఏదైనా కొత్త పనులకు ఈ రోజు ఎలాంటి మూహూర్తం చూడాల్సిన పనిలేదు. ఆలయానికి సందర్శించాలి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. మొత్తంగా పెళ్లి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించుకోవచ్చు. రోజు మొత్తం వివిధ కార్యక్రమాలతో సాగే పండుగ ఉగాది. ఉదయం అభ్యంగనస్నానంతో మొదలైన ఈ పండుగ సాయంత్రం పంచాంగ శ్రవణంతో ముగుస్తుంది. ఉగాదినాడు పంచాంగశ్రవణం తప్పని సరిగా వినాలి. దీనివల్ల సంవత్సరం మొత్తం మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. ఈ పండుగకు ఇదే పెద్ద హైలైట్. మరే పండుగకీ లేని పంచాంగశ్రవణ స్పెషలిటీ ఉగాదికి మాత్రమే సొంతం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook