తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో భాగమైన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌కు నూతన చైర్మన్ (SVBC New Chairman)ను ఏపీ ప్రభుత్వం నియమించింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజ కుటుంబీకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్ర (Sai Krishna Yachendra)ను ఎస్వీబీసీ ఛానల్ నూతన చైర్మన్‌గా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 



 


కొన్ని నెలల కిందట లైంగిక వేధింపుల ఆరోపణలతో సినీ నటుడు, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. మహిళా ఉద్యోగినితో అసభ్యకర సంభాషణ, వేధింపులు అని ఓ ఆడియో లీక్ కావడంతో పృథ్వీరాజ్ ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. అది తన వాయిస్ కాదని చెప్పిన నటుడు ప్రభుత్వ సూచన మేరకు పదవికి రాజీనామా చేయడం తెలిసిందే.



 


శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ (SVBC channel Chairman) పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేయడంతో సినీ వర్గాలు ఈ పదవిపై ఆసక్తి చూపించాయి. ముఖ్యంగా ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్‌ పదవి మోహన్ బాబుకు ఇస్తారని ప్రచారం జరిగింది. జీవితా రాజశేఖర్, నటుడు శ్రీనివాసరెడ్డి పేరును సైతం ఏపీ ప్రభుత్వం పరిశీలించిందని ప్రచారం జరిగింది. ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును ఎస్వీబీసీ ఛైర్మన్‌గా నియమిస్తారని భావిస్తున్న క్రమంలో పద రాగిని సంస్థ అధినేత సాయికృష్ణ యాచేంద్రకు బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.



 


దివంగత ముఖ్యమంత్రి, సీనియర్ ఎన్టీఆర్ పిలుపు మేరకు సాయికృష్ణ యాచేంద్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది సేవలు అందించారు. అయితే అనంతరం క్రీయాశీల రాజకీయాలకు ఈ వెంకటగిరి రాజ కుటుంబీకుడు దూరంగా ఉన్నారు. వివాహరహితుడు, వైఎస్సార్‌సీపీకి మద్దతుదారుడు కావడం, అందులోనూ సీనియారిటీ ఉన్న కారణంగా ఎస్వీబీసీ నూతన చైర్మన్‌గా సాయికృష్ణ యాచేంద్రను నియమితులయ్యారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe